రేవంత్ ప్లానింగ్.. జూపల్లి యాక్షన్.. కాంగ్రెస్ చేతికి వడ్డేపల్లి

మున్సిపాలిటీలు.. మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ అందరూ మాట్లాడుకున్న మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది వడ్డేపల్లి మున్సిపాలిటీనే.;

Update: 2026-02-15 06:40 GMT

మున్సిపాలిటీలు.. మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ అందరూ మాట్లాడుకున్న మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది వడ్డేపల్లి మున్సిపాలిటీనే. ఈ ఎన్నికల ఫలితాల ముందు వరకు సదరు జిల్లా వారికి తప్పించి.. మిగిలిన వారికి పెద్దగా పరిచయం లేని వడ్డేపల్లి మున్సిపాలిటీ.. ఎన్నికల ఫలితం భిన్నంగా రావటంతో అందరి చూపు వడ్డేపల్లిపై పడింది. అదే సమయంలో.. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అధికార కాంగ్రెస్ కానీ.. విపక్ష బీఆర్ఎస్ కానీ అంత బలమైన నేతను ఎందుకు గుర్తించలేకపోయారు? తనతో సహా ఎనిమిది మంది గెలిచేలా చేసిన వడ్డేపల్లి శ్రీనివాసరావు ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది.

దీని కంటే ముందు ఆయన నాయకత్వంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా తన సహచరులనుగెలిపించుకున్న ఆయన.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.ఈ పరిణామం వెనుక చక్రం తిప్పారు మంత్రి జూపల్లి క్రిష్ణారావు. దీంతో.. ఎన్నికల వేళ జరిగిన తప్పును ఆయన వెంటనే సరిదిద్దుకున్నట్లైంది. తాజా పరిణామంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ సొంతమైంది. మొత్తం 10 వార్డులు ఉన్న వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఎనిమిది మంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలవగా.. ఒకరు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి, మరొకరు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. తాజాగా ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీలో చేరటం ద్వారా.. మొత్తం పది వార్డుల్లో తొమ్మిది కాంగ్రెస్ సొంతమైన పరిస్థితి.

ఇంతకూ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వడ్డేపల్లి శ్రీనివాసరావు అలియాస్ శ్రీనన్నను ప్రధాన పార్టీలు ఎందుకు మిస్ చేసుకున్నాయి? అన్నదిప్పుడు చర్చగా మారింది. శ్రీనన్న విషయానికి వస్తే అతను మాజీ జెడ్పీటీసీగా పని చేశారు. ఆయనకు అలంపూర్ నియోజకవర్గంలోనూ వడ్డేపల్లి మండలంతోనూ సుమారు నలభై ఏళ్ల అనుబంధం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవమరించిన ఆయన.. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్లు ఆశించారు. అందుకు అధినాయకత్వం అంగీకరించలేదు. దీంతో.. పార్టీలో తనకున్న పరిచయాలతో కవితను కలిసినట్లుగా చెబుతారు.

అతడి బలం గురించి అవగాహన ఉన్న కవిత వెంటనే ఆయన్ను.. ఆయన మద్దతుదారులను ఒకటిగా చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేయించారన్నది ఒక వాదన. దీనికి భిన్నమైన వాదనలు వినిపిసతున్నాయి. సింహం గుర్తుపై పోటీ చేసిన పది మంది అభ్యర్థుల్లో ఎనిమిది మంది గెలుపొందటంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు వడ్డేపల్లి మీద పడింది. ఎన్నికల ఫలితం వెలువడిన వేళలో.. ఆయన గెలుపు వెనుక కవిత పాత్ర ఉందని ప్రచారం జరిగింది. అయితే.. తమ గెలుపులో కవిత పాత్ర లేదని తాము ఎవరి ఫోటోలు వాడుకోలేదని శ్రీనన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో.. తన సొంత బలంతోనే గెలిచినట్లుగా చెబుతున్న శ్రీనన్న తాజాగా మంత్రి జూపల్లి క్రిష్ణరావు సాయంతో ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసి.. తనతో సహా తన వర్గాన్ని కాంగ్రెస్ లో కలిపేయటం ద్వారా వడ్డేపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీకి సొంతమయ్యేలా చేశాడు.

ఇంతకూ వడ్డేపల్లి శ్రీనివాసను ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గుర్తించలేదు సరే. మరి కాంగ్రెస్ ఎందుకు గుర్తించలేదు? అన్నది మరో ప్రశ్న. ఈ అంశంపై మరింత స్పష్టత రావాలంటే.. వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్, ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వడ్డేపల్లి మున్సిపాలిటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి గెలుపొందారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు గద్వాల సరిత తిరుపతయ్య.

రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ కాంగ్రెస్ లోకి రావటం.. ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సరిత తిరుపతయ్య వర్గం గుర్రుగా ఉంది. బండ్ల రాకతో పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గుతుందన్న భావన ఎక్కువైంది. దీంతో.. గద్వాల నియోజకవర్గంలో రెండు బలమైన వర్గాలు కాంగ్రెస్ లో చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి ఎమ్మెల్యే బండ్ల వర్గమైతే.. రెండోది సరిత తిరుపతయ్య వర్గం. వీరి వర్గపోరు పుణ్యమా అని వడ్డేపల్లి మున్సిపాలిటీలో బలమైన శ్రీనన్నను గుర్తించలేదు.

చివరకు.. మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత శ్రీనన్న ఒక్కసారిగా వెలుగులోకి రావటమే కాదు.. అప్పటివరకు స్థానికంగా బలమైన నేతలుగా ఉన్న ఎమ్మెల్యే వర్గం.. సరిత వర్గానికి ధీటుగా ఎదిగిన పరిస్థితి. ఈ వాదనను బలం చేకూరేలా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వర్గ పోరును ఆదిలోనే పసిగట్టి ఒక కొలిక్కి తీసుకురావటంతో మంత్రి జూపల్లి ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అయితే.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం శ్రీనన్నను సంప్రదించి.. వారంతా కాంగ్రెస్ లో చేరేలా మాట్లాడి ఒప్పించి.. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసేలా చేసి.. వారిని పార్టీలో చేర్పించటం ద్వారా చేజారిన వడ్డేపల్లి మున్సిపాలిటీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరినట్లైంది. దీంతో.. తన తప్పును వాయువేగంతో మంత్రి జూపల్లి సరిదిద్దుకున్నట్లైంది. అదే సమయంలో వర్గపోరుతో సతమతమవుతున్న ఎమ్మెల్యే వర్గం.. సరిత వర్గానికి గుదిబండలా ఇప్పుడు శ్రీనన్న తెర మీదకు వచ్చారని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News