అమెరికా వీసాలు : సోషల్ మీడియా వెట్టింగ్ మొదలైంది..

ఈ నిబంధనల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని అమెరికా విదేశాంగ శాఖ వివరించింది. అందరు వీసా దరఖాస్తుదారులను క్షుణ్ణంగా వెట్టింగ్ చేస్తాం.;

Update: 2025-12-15 08:21 GMT

అమెరికా ఆంక్షలు పెడుతోంది. విదేశీయులను ట్రంప్ తరుముతున్నాడు. రోజుకో కొత్త నిబంధనలు పెడుతూ ముచ్చెటమటలు పుట్టిస్తున్నాడు. అమెరికాలో ఇప్పుడు విదేశీయులకు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఊడుతామో తెలియని దారుణ పరిస్థితులున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికాలో ఉద్యోగం లేదా నివాసం కోసం దరఖాస్తు చేసుకునేవారికి సంబంధించి అగ్రరాజ్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ, హెచ్4 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే వెట్టింగ్ ప్రక్రియ నేటి సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఆన్ లైన్ ఉనికి సమీక్ష

డిసెంబర్ 15వ తేదీ నుంచి వీసా దరఖాస్తుదారుల ఆన్ లైన్ ఉనికిని సమీక్షించే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు కేవలం హెచ్1 బీ, హెచ్4 వీసాలకే కాక, ఎఫ్ విద్యార్థి, ఎం, జే (ఎక్స్చేంజ్ విజిటర్) వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా వర్తిస్తాయి.

పబ్లిక్ కు మార్చుకోవాలి.

వెట్టింగ్ ప్రక్రియకు సహకరించేందుకు వీలుగా.. హెచ్1బీ, హెచ్4, ఎఫ్, ఎం, జే వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా తమ సోషల్ మీడియా ఖాతాల సెట్టింగ్ లను ప్రైవేట్ నుంచి పబ్లిక్ కు మార్చుకోవాలని విదేశాంగ శాఖ సూచించింది. ఇప్పటికే ఈ కొత్త నిబంధనల కారణంగా కొన్ని హెచ్1బీ వీసాల ఇంటర్వ్యూలను వాయిదా వేసినట్టు సమాచారం.

జాతీయ భద్రతే ప్రాధాన్యత

ఈ నిబంధనల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని అమెరికా విదేశాంగ శాఖ వివరించింది. అందరు వీసా దరఖాస్తుదారులను క్షుణ్ణంగా వెట్టింగ్ చేస్తాం. వారి ఆన్ లైన్ ఉనికిని పరిశఈలిస్తాం . ప్రతి వీసా నిర్ణయమూ జాతీయ భద్రతా కోణంలోనే ఉంటుంది. వీసా జారీ ప్రక్రియలో అమెరికా అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తుంది’ అని పేర్కొంది.

విదేశాంగ శాఖ ప్రకటన ఇదీ

అమెరికాలోకి ప్రవేశించేవారు అమెరికన్లకు హానీ చేయబోరని మేం నమ్మాలి. వారు అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగించబోరని విశ్వసించాలి. అందుకే వీసా దరఖాస్తుదారులందరూ తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలి.

ఈ కొత్త నిబంధనలు ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు కీలకమైన హెచ్1బీ వీసా దరఖాస్తుదారులపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. వీసా జారీ ప్రక్రియ మరింత కఠినతరం కానుంది.

Tags:    

Similar News