అమెరికా వీసీ కావాలంటే గత 5 ఏళ్ల సోషల్ మీడియా చరిత్ర తప్పనిసరి!
గతంలో విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలకు ముందు తమ సోషల్ మీడియా ఖాతాలలోని వివాదాస్పదమైన పోస్టులను తొలగించే ప్రయత్నం చేసేవారు.;
అమెరికాలో వలస విధానాలు మరింత కఠినతరం అవుతున్న నేపథ్యంలో, వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ ప్రభుత్వం ఒక కీలక నిబంధనను జోడించింది. ఇది ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
కొత్త వీసా నిబంధన ఏమిటి?
భారత్‌తో పాటు ఇతర దేశాల విద్యార్థులు అమెరికా విద్యా వీసా (F1) కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, గత ఐదేళ్ల సోషల్ మీడియా చరిత్రను తప్పనిసరిగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం దరఖాస్తుదారులు DS-160 వీసా దరఖాస్తు ఫారమ్‌లో తమ గత ఐదేళ్లలో వాడిన ప్రతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన యూజర్‌నేమ్‌లు / హ్యాండిల్స్‌ను జాబితా చేయాలి.
- ఎవరికి ఎలాంటి ప్రభావం?
ఈ మార్పు ప్రధానంగా విదేశాల్లో చదువుకోవాలనుకునే యువతపై ప్రభావం చూపనుంది. గతంలో విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలకు ముందు తమ సోషల్ మీడియా ఖాతాలలోని వివాదాస్పదమైన పోస్టులను తొలగించే ప్రయత్నం చేసేవారు. అయితే ఇప్పుడు, అమెరికా ఎంబసీ సమగ్ర చరిత్రను కోరుతున్నందున, అవి తొలగించినా, ఆ డేటాను దాచిపెట్టినట్లు పరిగణించే అవకాశం ఉంది.
- వీసా తిరస్కరణ ప్రమాదం!
వీసా దరఖాస్తు చేసే ముందు అందించిన సమాచారం నిజమైనదని ధృవీకరించాల్సి ఉంటుంది. అబద్ధపు సమాచారం ఇవ్వడం లేదా సోషల్ మీడియా వివరాలను దాచిపెట్టడం వంటివి అనర్హతకు దారితీస్తాయని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల వీసా రాకపోవడమే కాకుండా భవిష్యత్తులో కూడా అమెరికా వీసాలకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
- ఏయే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్?
అధికారికంగా కొన్ని ప్లాట్‌ఫామ్‌లను ప్రత్యేకంగా పేర్కొనకపోయినా, సాధారణంగా పరిగణించే ప్లాట్‌ఫామ్‌లలో ఇవి ఉన్నాయి..ఫేస్బుక్, ట్విట్టర్ (X), ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, రేడిత్, టిక్ టాక్, స్నాప్ చాట్, లింక్డ్ ఇన్, టుంబర్, పింటరెస్ట్ ఖాతాల వివరాలను అందజేయాలి. దరఖాస్తుదారుడు వీటితో సహా, యాక్టివ్‌గా ఉన్న అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను అందించాలి.
విద్యార్థులు, వలసదారులు ఈ కొత్త నిబంధనలపై అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్ట్, వ్యాఖ్యపై ఇప్పుడు వీసా నిర్ణయం ఆధారపడే అవకాశం ఉన్నందున, మితమైన వినియోగం, జాగ్రత్తగా ప్రవర్తన తప్పనిసరి. అమెరికా వెళ్లాలనుకునే యువతకు ఇది ఒక ముఖ్యమైన హెచ్చరికగా పరిగణించవచ్చు.