దట్టమైన యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ అమరికా మంత్రి ఎంట్రీ!

మనకు.. అగ్రరాజ్యం అమెరికాకు మధ్య తేడా ఏమిటో ఇట్టే అర్థమయ్యే ఉదంతంగా దీన్ని చెప్పొచ్చు.;

Update: 2025-05-02 07:12 GMT

మనకు.. అగ్రరాజ్యం అమెరికాకు మధ్య తేడా ఏమిటో ఇట్టే అర్థమయ్యే ఉదంతంగా దీన్ని చెప్పొచ్చు. తన ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చాలు.. అమెరికా ఒంటికాలి మీద ఎంతలా చెలరేగిపోతుందో తెలిసిందే. అదే.. తన దేశం మీదకు దాడికి ఎవరైనా ప్లాన్ చేసే సాహసం చేస్తే.. అంతర్జాతీయ చట్టాలు మొదలుకొని వేటిని పట్టించుకోకుండా.. అవసరమైతే ఒక దేశంలోకి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా వెళ్లిపోయి.. తాను టార్గెట్ చేసే వారిని అంతం చేసే వరకు వెనుకాడదు. అలాంటి అమెరికా.. పహల్గాం ఉగ్రదాడి వేళ భారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ ఎంట్రీ ఇచ్చారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.

తాజాగా భారత్ - పాక్ విదేశాంగ మంత్రులకు వేర్వేరుగా ఫోన్ కాల్స్ చేశారు మార్కో. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వైనంపై ఆందోలన చేస్తూ.. ఇరు దేశా లమధ్య సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటం గమనార్హం. ఈ రెండు దేశాల మధ్య మధ్య ఉద్రిక్తతలు పెరగటం ఎవరికి మేలు చేయదన్న ఆయన.. ఘర్షణ వాతావరణం సమిసిపోయేలా చర్యలు తీసుకోవాలన్నారు.

భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కు ఫోన్ చేసిన అమెరికా విదేశాంగ మంత్రి.. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించటం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ.. ఉగ్రవాదంపై జరిగే పోరులో భారత్ కు తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గే అంశంపై కలిసి పని చేయాలని చెప్పారు. పూర్తిస్థాయిలో సంయమనం పాటించాలన్నారు.

అమెరికా విదేశాంగ మంత్రికి జై శంకర్ బదులిస్తూ.. పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరలను.. వారి వెనకున్న అసలైన కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించక తప్పదని చెప్పినట్లుగా ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తో మాట్లాడుతూ.. భారత్ తో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఉద్రిక్తతలు సడలిపోయేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు.

పహల్గాంలో 26 మందిని పొట్టన పెట్టుకున్న ముష్కరులకు సరైన శిక్షపడేలా భారత్ కు సహకారం అందించాలని చెప్పటంతో పాటు.. పాక్ నుంచి నిర్మాణాత్మక చర్యల్ని తాము కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన పాక్ ప్రధాని.. పహల్గాం ఉదంతంతో తమకు సంబంధం లేదన్న ఆయన.. ఉద్రిక్తతలు పెంచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా భారత్ ను కట్టడి చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. సింధుజలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయటాన్ని షెహబాజ్ షరీఫ్ తప్పు పడుతూ.. ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపేయటం చెల్లదన్నారు. మొత్తంగా చూస్తే..ఇరుదేశాల మధ్య కమ్ముకున్న దట్టమైన యుద్ధ మేఘాల్ని ఫోన్ కాల్ తో కాస్త పలుచనయ్యే ప్రయత్నాన్ని అమెరికా విదేశాంగ మంత్రి చేసినట్లుగా చెప్పొచ్చు.

Tags:    

Similar News