233 ఏళ్ల నాటి 'పెన్నీ' కాయిన్‌కు ఇక సెలవు..అమెరికాకు ఏటా రూ.477 కోట్లు ఆదా!
ఈ నిర్ణయం ఆ నాణేన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు, దాని తక్కువ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల అమెరికాకు ఏటా దాదాపు రూ.477 కోట్లు ఆదా అవుతుంది.;
అమెరికాలో అత్యంత తక్కువ విలువైన కాయిన్ 'పెన్నీ' (1 సెంట్) త్వరలో చరిత్రలో కలిసిపోనుంది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటన జారీ చేసింది. దాని ప్రకారం.. 2026 ప్రారంభం నుంచి కొత్త పెన్నీ కాయిన్‌ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేస్తారు. ఈ నిర్ణయం ఆ నాణేన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు, దాని తక్కువ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల అమెరికాకు ఏటా దాదాపు రూ.477 కోట్లు ఆదా అవుతుంది.
ఏటా రూ.477 కోట్ల ఆదా.. ఎలా?
ప్రస్తుతం ఒక పెన్నీ కాయిన్‌ను తయారు చేయడానికి దాదాపు 3.7 సెంట్లు (మన రూపాయల్లో సుమారు రూ.3.08) ఖర్చవుతుంది. అంటే, దాని ముద్రిత విలువ కంటే ఇది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. 2024లో అమెరికా మింట్ (నాణేలు ముద్రించే సంస్థ) 3.17 బిలియన్ పెన్నీ కాయిన్‌లను తయారు చేసింది. దీనికి దాదాపు 85 మిలియన్ డాలర్లు (మన రూపాయల్లో సుమారు రూ.710 కోట్లు) ఖర్చయింది. ఈ ఉత్పత్తిని ఆపేయడం వల్ల ప్రభుత్వానికి ఏటా దాదాపు 56 మిలియన్ డాలర్లు (సుమారు రూ.477 కోట్లు) ఆదా అవుతుంది.
పాత పెన్నీ కాయిన్‌లు ఏం అవుతాయి?
కొత్త పెన్నీ కాయిన్‌ల ఉత్పత్తిని ఆపేసినా ఇప్పటికే చెలామణిలో ఉన్న కాయిన్‌లు మాత్రం చెల్లుబాటు అవుతాయి. అంటే వాటిని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 114 బిలియన్ల పెన్నీ కాయిన్‌లు చెలామణిలో ఉన్నాయి.
నగదు లావాదేవీలపై ప్రభావం
పెన్నీ ఉత్పత్తి నిలిచిపోయిన తర్వాత నగదు లావాదేవీలలో ధరలను దగ్గరి 5 సెంట్ల వరకు రౌండ్ ఆఫ్ చేస్తారు. కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇది ఇప్పటికే అమల్లో ఉంది. డిజిటల్ లావాదేవీలపై దీని ప్రభావం ఏమీ ఉండదు. పెన్నీ కాయిన్ మొదటిసారిగా 1793లో విడుదలయ్యింది. 1909 నుంచి దీనిపై అప్పటి అధ్యక్షుడు అబ్రహం లింకన్ బొమ్మ ముద్రిస్తున్నారు. ఆర్థికంగా దీని ప్రాముఖ్యత తగ్గినప్పటికీ ఇది అమెరికా చరిత్ర, సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగానే కొనసాగుతుంది.