ఇది వార్ కాదు, రివేంజ్.. మరో పని మొదలుపెట్టిన అమెరికా!
ఇది యుద్ధం కాదు.. జస్ట్ రివేంజ్ అంటూ ఓ కొత్త పని మొదలు పెట్టింది అగ్రరాజ్యం అమెరికా. ముందుగా చెప్పినట్లుగానే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా సిరియాలో వైమానిక దాడులు ప్రారంభించింది.;
ఇది యుద్ధం కాదు.. జస్ట్ రివేంజ్ అంటూ ఓ కొత్త పని మొదలు పెట్టింది అగ్రరాజ్యం అమెరికా. ముందుగా చెప్పినట్లుగానే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా సిరియాలో వైమానిక దాడులు ప్రారంభించింది. దీనికి ఆపరేషన్ హాక్వై స్ట్రైక్ అని పేరు పెట్టారు. గ్యాప్ లేకుండా ఎంచుకున్న లక్ష్యాలపై బాంబులతో విరుచుకు పడుతున్నారు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు.
అవును... ఈ నెల ప్రారంభంలో పాల్మిరాలో అమెరికా, సిరియా దళాల కాన్వాయ్ లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు అమెరికన్ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు అమెరికా సైనికులు గాయపడ్డారు. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దీనికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే ఆపరేషన్ మొదలుపెట్టారు.
తాజాగా ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించిన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్... ఐసిస్ ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలు, ఆయుధ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఇది యుద్ధానికి ఆరంభం కాదని.. ఇది ఐసిస్ కు తాము విధిస్తున్న శిక్ష అని.. ఇది ప్రతీకారం మాత్రమే అని.. మా శత్రువులను వెంటాడి చాలామందిని చంపామని.. ఇది కంటిన్యూ అవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన జోర్డాన్ సైన్యం... తమ వైమానిక దళం దక్షిణ సిరియాలోని అనేక ఐసిస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, ఖచ్చితమైన వైమానిక దాడుల్లో పాల్గొందని తెలిపింది. కాగా.. సిరియా ఇటీవల చేరిన ఐసిస్ కు వ్యతిరేకంగా ప్రపంచ సంకీర్ణంలో ఉన్న 90 దేశాలలో జోర్డాన్ ఒకటి. అయితే... ఈ దాడుల్లో ఎంతమంది మరణించారనేది అమెరికా కానీ, జోర్డాన్ కాని వెల్లడించలేదు!
ఇదే సమయంలో ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించే యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో.. తమ దళాలు మధ్య సిరియా అంతటా అనేక ప్రదేశాల్లో 70కి పైగా లక్ష్యాలను ఫైటర్ జెట్ లు, హెలీకాప్టర్లు, ఫిరంగి దళాలతో దాడి చేశాయని.. జోర్డాన్ వైమానిక దళం ఫైటర్ విమానాలతో మద్దతు ఇస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన యూకేకి చెందిన వార్ మానిటర్ అయిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్.. ఐసిస్ సెల్ నాయకుడు, సభ్యులతో కలిసి ఈ దాడుల్లో కనీసం ఐదుగురు మరణించారని తెలిపింది.