చోరీలు, దోపిడీలు చేస్తే అమెరికాలోకి శాశ్వత నిషేధం
భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికకు కారణం ఓ భారతీయ పర్యాటకురాలు అమెరికాలోని రిటైల్ స్టోర్‌లో దొంగతనానికి పాల్పడిన ఘటన.;
అగ్రరాజ్యం అమెరికా దృఢంగా హెచ్చరిస్తోంది. అమెరికాలో చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడితే కేవలం న్యాయపరమైన శిక్షలే కాదు, భవిష్యత్తులో వీసా అవకాశాలు కూడా పూర్తిగా కోల్పోతారని స్పష్టం చేసింది. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికకు కారణం ఓ భారతీయ పర్యాటకురాలు అమెరికాలోని రిటైల్ స్టోర్‌లో దొంగతనానికి పాల్పడిన ఘటన.
ఇల్లినాయిస్‌లోని ప్రముఖ రిటైల్ స్టోర్ ‘టార్గెట్’లో భారత్‌కు చెందిన ఓ మహిళ దాదాపు 7 గంటల పాటు తిరుగుతూ అనుమానాస్పదంగా వ్యవహరించినట్లు అక్కడి సిబ్బంది గుర్తించారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత, ఆమె వెనుకదారి గుండా బయటకు పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈ దొంగతన ప్రయత్నంలో ఆమె దాదాపు 1300 అమెరికన్ డాలర్ల విలువైన (రూ. 1.11 లక్షలు) వస్తువులను తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఆమె అరెస్టుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన నేపథ్యంలో అమెరికాలోని యూఎస్ ఎంబసీ తమ అధికారిక పేజ్‌లో హెచ్చరికలతో కూడిన పోస్ట్ విడుదల చేసింది. ‘‘అమెరికాలో చట్టాన్ని ఉల్లంఘించడమంటే, వీసా రద్దు కావటమే కాదు, భవిష్యత్తులో వీసా పొందే అర్హతను కూడా కోల్పోవడమే. విదేశీయులు కూడా అమెరికా చట్టాలను గౌరవించాలి. శాంతి భద్రతల విషయంలో అమెరికా తన నిబంధనల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదు’’ అని పేర్కొన్నారు.
వీసా కల కనేవారు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. చిన్న తప్పు అయినా, అది భవిష్యత్ అవకాశాలను దెబ్బతీయవచ్చు. న్యాయ వ్యవస్థపైనా, వీసా విధానాలపైనా పూర్తి నమ్మకంతో ఉన్న అమెరికా ఈ విషయంలో ఎలాంటి ఉపేక్ష చూపకపోవచ్చు. అందుకే చట్టాలను గౌరవించడం, మంచి పౌరసభ్యుల్లా ప్రవర్తించటం ప్రతి ఒక్కరి బాధ్యత.