సంచలనం.. "మోడీ 'స్నేహం' వల్ల కలిగే నష్టాన్ని దేశం భరిస్తోంది"!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత్‌ పై సుంకాల చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-07-30 17:26 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత్‌ పై సుంకాల చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... భారత వస్తువులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇవి ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. దీనిపై దేశంలోని పలువురు నాయకులు స్పందించారు. ఈ సందర్భంగా మోడీపై నిప్పులు చెరిగారు!

అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకాలను విధించడంతో కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ సందర్భంగా... ట్రంప్ భారతదేశంపై 25% సుంకాన్ని విధించారు.. దానితో పాటు జరిమానా కూడా విధించారు.. నరేంద్ర మోడీ 'స్నేహం' వల్ల కలిగే నష్టాన్ని ఇప్పుడు దేశం భరిస్తోంది అంటూ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది.

ఇదే సమయంలో... మోడీ ట్రంప్ కోసం ప్రచారం చేశారని.. ఆయనను ఆత్రంగా కౌగిలించుకున్నారని.. ఫోటోలకు పోజులిచ్చారని.. వాటిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారని.. చివరికి, ట్రంప్ భారతదేశంపై సుంకాలను విధించారని.. భారతదేశ విదేశాంగ విధానం పూర్తిగా విఫలమైందని.. కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది!

ఇదే క్రమంలో... కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ... అమెరికా అధ్యక్షుడు భారతదేశంపై చేసిన అవమానాలపై మౌనంగా ఉంటే.. ట్రంప్ చేతుల్లో భారతదేశం ప్రత్యేక గౌరవం పొందుతుందని మిస్టర్ మోడీ భావించారని.. అయితే, స్పష్టంగా అది జరగలేదని అన్నారు. ఈ సమయంలో... ఇందిరాగాంధీ నుండి ప్రేరణ పొంది, అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా మోడీ నిలబడాలని సూచించారు.

ఇదే సమయంలో... అమెరికా అధ్యక్షుడి నుండి వస్తున్న బెదిరింపుల గురించి కాంగ్రెస్ ఆందోళన చెందుతోందని.. ట్రంప్ భారతదేశాన్ని బెదిరిస్తున్నట్లు అనిపిస్తోందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ విషయంలో భారతదేశం ఆయనకు తగిన విధంగా సమాధానం చెప్పాలని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు చెందిన మరో ఎంపీ రాజీవ్ శుక్లా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... అమెరికా చర్యను నిజంగా తప్పుడు చర్యగా అభివర్ణించారు. భారత ప్రభుత్వం ట్రంప్‌ ను స్నేహితుడిగా భావిస్తున్నప్పటికీ.. ఆయన దేశాన్ని చెంపదెబ్బ కొట్టారని అన్నారు. దీని వల్ల భారతీయ వ్యాపారవేత్తలు తీవ్రంగా నష్టపోతారని.. ఈ విషయంపై తాము పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్... భారత్ లో ఐఫోన్‌ లను తయారు చేయవద్దని ట్రంప్ ఆపిల్‌ ను బెదిరించారని.. తాను పాకిస్తాన్‌ ను ప్రేమిస్తున్నానని, భారత్ దాని గురించి ఆలోచించాలని కూడా అన్నారని.. ప్రధాని మోడీ ప్రతిరోజూ భారతదేశాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు.. మోడీ నెక్స్ట్ స్టెప్ ఏమిటో చెప్పాలని కోరారు!

Tags:    

Similar News