యూపీఐ పేమెంట్ లో మరో సంచలన అప్ డేట్.. ఇక అది అవసరమే లేదు..
ఈ డిజిటల్ చెల్లింపుల విప్లవం ప్రతిరోజూ కొత్త మైలురాళ్లను చేరుతోంది. చిన్న చిల్లర కొనుగోళ్ల నుంచి పెద్ద వ్యాపార లావాదేవీల వరకు ఇప్పుడు ప్రతి చోటా ‘యుపిఐ’ అనే పేరే వినిపిస్తోంది.;
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ను అందుకోవడం బహూషా ప్రపంచంలోని అగ్రదేశం వల్ల కూడా కాదు. భారత్ లో ఏ మూలకు వెళ్లినా యూపీఐ పేమెంట్లు అవుతుంటాయి. ఐదు రూపాయల పిప్పర మెంట్ నుంచి తీసుకోవాలే గానీ లక్షల్లో పేమెంట్లు కేవలం ఒక్క క్లిక్ ద్వారా జరిగిపోతున్నాయి. ఇండియా విజిటింగ్ కు వచ్చే ఇతర దేశస్తులు కూడా భారతీయ పేమెంట్ విధానంకు ఫిదా అవుతున్నారు.
ఈ డిజిటల్ చెల్లింపుల విప్లవం ప్రతిరోజూ కొత్త మైలురాళ్లను చేరుతోంది. చిన్న చిల్లర కొనుగోళ్ల నుంచి పెద్ద వ్యాపార లావాదేవీల వరకు ఇప్పుడు ప్రతి చోటా ‘యుపిఐ’ అనే పేరే వినిపిస్తోంది. ఒకప్పుడు నగదు లేకపోతే కొనుగోలు కష్టమయ్యేది. కానీ ఇప్పుడు కేవలం మొబైల్, అందులో యాప్ ఉంటే చాలు.. చాయ్ షాపులోనైనా, మార్కెట్‌లోనైనా, ఆన్‌లైన్‌లోనైనా చెల్లింపులు క్షణాల్లో పూర్తవుతున్నాయి.
యూపీఐని మరింత భద్రంగా నిర్వహిస్తుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఎప్పటికప్పుడు కొత్త కొత్త విధానాలను తీసుకువస్తూ.. భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 8, 2025 నుంచి యూపీఐ లావాదేవీలకు పిన్ అవసరం లేదు. బయోమెట్రిక్ ధృవీకరణతోనే చెల్లింపులు జరుగుతాయి. అంటే మీ ముఖం లేదా వేలిముద్రే ఇప్పుడు మీ పాస్‌వర్డ్.. ఇది కేవలం సాంకేతిక మార్పు కాదు.. డిజిటల్ చెల్లింపుల భవిష్యత్తును మార్చే అద్భుతమైన అడుగు.
ఇప్పటి వరకు యూపీఐ వినియోగదారుడు ప్రతి చెల్లింపునకు 4 లేదా 6 అంకెల పిన్ నమోదు చేయాలి. ఇది భద్రత పరంగా సరైనదే అయినా ఒక్కో సమయంలో మరో వ్యక్తికి పిన్ నెంబర్ తెలిస్తే ఫ్రాడ్ జరిగే అవకాశం లేకపోలేదు. పైగా వేగం, సౌలభ్యం పరంగా కూడా కొంత ఇబ్బందికి గురి చేసింది. ఇకపై మొబైల్‌లోని ఫేస్ రికగ్నిషన్ లేదంటే ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ద్వారా లావాదేవీ సెకన్లలో పూర్తవుతుంది.
యూపీఐ చెల్లింపులకు ఇది పూర్తి భద్రతే అయినా.. బయోమెట్రిక్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుందా..? అన్న అనుమానాలు కొందరిని కలిచివేస్తున్నాయి. ఒక వేళ స్కామర్లు పొంచి ఉంటే వారికి మన పూర్తి వివరాలను విస్తరిలో పెట్టి ఇచ్చినట్లే. ఆధార్ నుంచి బ్యాంకు ఖాతా వరకు అన్నింటికీ బయోమెట్రికే ప్రధానం. వాటిని కూడా దొంగలిస్తే ఇక అంతే సంగతులు అంటున్నారు కొందరు నిపుణులు. డిజిటల్ కావడం ఎంత ముఖ్యమో.. భద్రత కూడా అంతకంటే ముఖ్యం. అయినా, ఈ ఫీచర్ యూపీఐ చెల్లింపుల వినియోగాన్ని వేగవంతం చేస్తుంది. నేడు మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్ నెట్ విస్తరించింది. కాబట్టి స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. దీంతో యూపీఐ చెల్లింపులు సాధారణ ప్రజల వరకూ చేరువవుతాయి.
యూపీఐ పిన్‌కు గుడ్‌బై చెప్పి, ఫేస్ లేదంటే బయోమెట్రిక్ చెల్లింపు చేసే కాలం మొదలైంది. ఇది దేశం డిజిటల్ ఆర్థిక మార్గంలో వేస్తున్న మరో ముందడుగుగా చెప్పవచ్చు.. వేగం, సౌలభ్యం, భద్రత అనే మూడు మూలాల మీద నిలిచే కొత్త ప్రయాణం.