యూపీఏ సేవల్లో అంతరాయం.. కోట్లాది మందికి చుక్కలు
గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువ అయ్యాయి. అదెంతగా అంటే.. ఎవరికైనా అవసరం వచ్చి కాసిన్ని డబ్బులు నోట్ల రూపంలో ఇవ్వమంటే.. పర్సులో ఆ మాత్రం లేని దుస్థితి.;
గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువ అయ్యాయి. అదెంతగా అంటే.. ఎవరికైనా అవసరం వచ్చి కాసిన్ని డబ్బులు నోట్ల రూపంలో ఇవ్వమంటే.. పర్సులో ఆ మాత్రం లేని దుస్థితి. దానికి బదులుగా చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లోనే పేమెంట్లు అన్నీ అయిపోతున్న పరిస్థితి. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో యూపీఏ సేవలు తరచూ అంతరాయానికి గురవుతున్నాయి.
తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితి ఈ రోజు (శనివారం) చోటు చేసుకుంది. ఎవరికైనా చెల్లింపులు చేస్తుంటే.. జరగకపోవటం.. పేమెంట్లు కాకపోవటం లాంటివి చోటు చేసుకున్నాయి. యూపీఏ సేవల్లో భాగస్వామ్య సంస్థలైన గూగుల్ పే.. ఫోన్ పే తో పాటు ఇతర సంస్థల పేమెంట్లు నిలిచిపోయాయి. దీంతో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పరిస్థితి.
డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ ప్రకారం శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి దాదాపు వెయ్యి మందికి పైనే యూపీఐ సేవల్లో అంతరాయం గురించి కంప్లైంట్ చేయటం గమనార్హం. ఇటీవల కాలంలో యూపీఏ సేవలు తరచూ మొరాయిస్తున్నాయి. మార్చి 26న ఇలాంటి పరిస్థితే ఏర్పడగా.. సాంకేతిక కారణాలని చెప్పటం తెలిసిందే. ఏప్రిల్ రెండో తేదీన యూపీఐ చెల్లింపులు కాసేపు ఆగిపోయాయి. తాజాగా మళ్లీ మరోసారి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఆటంకం చోటు చేసుకోవటం గమనార్హం. దీనికి అసలు కారణం ఏమిటన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.