మ్యాగీ డేంజర్.. వద్దన్నా వండినందుకు ప్రాణాలు తీసుకున్న తాతయ్య
రామ్‌ఔతార్ నూడుల్స్ వండొద్దని గట్టిగా చెప్పాడు. కానీ ఎవరూ ఆయన మాట వినలేదు. చివరికి కోపం పట్టలేక తన గదిలోకి వెళ్లి అక్రమంగా తెచ్చుకున్న తుపాకీతో తలలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.;
యూపీ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ ఉద్యోగి ఒకరు ఇంట్లో పిల్లల ఆరోగ్యం కోసం నూడుల్స్ (మ్యాగీ లాంటివి) వండొద్దని గట్టిగా చెబుతుండేవాడు. మొన్న రాత్రి ఇంట్లో నూడుల్స్ వండుతుంటే వద్దు అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని చెప్పాడు. అయినా వినకపోవడంతో కోపంతో తుపాకీతో తలలో కాల్చుకుని చనిపోయాడు. ఆ తాతయ్య తీసుకున్న ఈ దారుణమైన నిర్ణయంతో ఇంట్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. పోలీసులే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ తాతయ్య చేసిన పనితో నూడుల్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
గంగాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంపాపుర్వాలో రామ్‌ఔతార్ అనే రిటైర్డ్ ఉద్యోగి నివస్తుండేవాడు. ఆయన ఇంట్లో నూడుల్స్ వండుతుంటే ఎప్పుడూ కోప్పడేవాడు. ఆయన దృష్టిలో నూడుల్స్ ఆరోగ్యానికి చాలా హానికరం, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో రామ్‌ఔతార్ తన కొడుకు దినేష్, మనవడితో ఇంట్లో కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఇంట్లో నూడుల్స్ వండటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
రామ్‌ఔతార్ నూడుల్స్ వండొద్దని గట్టిగా చెప్పాడు. కానీ ఎవరూ ఆయన మాట వినలేదు. చివరికి కోపం పట్టలేక తన గదిలోకి వెళ్లి అక్రమంగా తెచ్చుకున్న తుపాకీతో తలలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీ శబ్దం విని కుటుంబ సభ్యులు గదిలోకి పరిగెత్తుకు రాగా, రక్తపు మడుగులో పడి ఉన్న రామ్‌ఔతార్‌ను చూసి గట్టిగా ఏడ్చారు. చుట్టుపక్కల వాళ్లు కూడా గుమికూడారు. సమాచారం అందుకున్న గంగాఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ మిశ్రా తన సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారు. రాత్రి పొద్దుపోయే వరకు ఫోరెన్సిక్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది.
చనిపోయిన రామ్‌ఔతార్ తమ్ముడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన నూడుల్స్ వండటాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవాడు. దాని గురించి ఎప్పుడూ కోపంగా ఉండేవాడు. ఇంట్లో నూడుల్స్ వండితే భోజనం కూడా చేసేవాడు కాదు. మొన్న రాత్రి కూడా నూడుల్స్ వండొద్దని చెప్పినా ఎవరూ వినకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం పూర్తి కేసును దర్యాప్తు చేస్తున్నారు. భార్య చనిపోయినప్పటి నుంచి ఆయన ఒంటరిగా, దిగులుగా ఉండేవాడని గంగాఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ మిశ్రా తెలిపారు. ఆయనకు మ్యాగీ, పాస్తా వంటి పాశ్చత్య వంటకాలు అంటే కూడా చాలా కోపం ఉండేదట. గురువారం రాత్రి ఇంట్లో పిల్లల కోసం మ్యాగీ వండుతుంటే ఆయన చాలా కోప్పడ్డాడని, ఇంట్లో మ్యాగీ, పాస్తా వండొద్దని చాలాసార్లు చెప్పినా ఎవరూ వినకపోవడంతో విసిగిపోయి తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.