రాజశేఖర్ రెడ్డి శిష్యుడు చంద్రబాబుని పొగడడటమా ? వైఎస్సార్ ఫ్యాన్స్ హర్ట్ !

ఇక తెలంగాణాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబర్ మీట్ కి చంద్రబాబుని ఆహ్వానించేందుకు ఏపీకి వచ్చిన కోమటిరెడ్డి ఆయనతో చాలా సేపు ముచ్చటించారు.;

Update: 2025-12-06 17:45 GMT

వైఎస్సార్ అధికారంలోకి వచ్చి సీఎం గా కేవలం అయిదుంపావు ఏళ్ళు మాత్రమే ఉన్నారు. ఆయన రాజకీయ జీవితం మొత్తం విపక్షంలోనే గడచింది. అయితే వైఎస్సార్ కి అతి పెద్ద బలం అనుచరులు అభిమానులు. అలా వైఎస్సార్ సాహచర్యంతో ఆయన శిష్యరికంలో ఎంతగానో ఎదిగిన నాయకులు అనేక మంది కనిపిస్తారు. ఉమ్మడి ఏపీని వైఎస్సార్ పాలించారు. ఆయనకు ఏపీతో సమానంగా తెలంగాణాలోనూ ఎంతో మంది శిష్యులు ఉన్నారు. అలాంటి వారిలో అతి ముఖ్యుడిగా ప్రస్తుతం తెలంగాణా మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఆయన ఒక ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సూటిగా మాట్లాడతారు అని పేరు. అలాంటి నాయకుడు వైఎస్సార్ శిష్యునిగా ఉంటూ ఏపీకి వెళ్ళి మరీ చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు. ఒక విధంగా ఈ రాజకీయం అసలు ఎవరూ ఊహించలేనిది. మరి ఎందుకు ఏమిటి ఈ విధంగా జరిగింది అంటే చాలానే ముచ్చట్లు చెప్పుకోవాల్సి ఉంది అని అంటున్నారు.

వైఎస్సార్ తోనే :

ఇదిలా ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చినా వైఎస్సార్ ద్వారానే కీలక పాత్ర పోషించారు. ఆయన 1999లో తొలిసారి నల్గొండ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా ఉన్నారు. అలా తన శిష్యులు చాలా మందికి టికెట్లు ఇప్పించారు అని అంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్సార్ కోటరీలో ఉంటూ వచ్చారు. ఇక 2004లో వైఎస్సార్ సీఎం కాగానే ఆయన మంత్రి కూడా అయ్యారు అలా తన రాజకీయం పూర్తిగా జోరెక్కించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ తరువాత రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో మంత్రిగా పని చేశారు. ఆయన మధ్యలో ఒకసారి 2019లో ఎంపీగా కూడా గెలిచారు. వైఎస్సార్ గురించి ఎక్కువగా మాట్లాడే హార్డ్ కోర్ అభిమానిగా ఆయనను చెప్పుకుంటారు.

బాబు విజనరీ అంటూ :

ఇక తెలంగాణాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబర్ మీట్ కి చంద్రబాబుని ఆహ్వానించేందుకు ఏపీకి వచ్చిన కోమటిరెడ్డి ఆయనతో చాలా సేపు ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు ఏపీలో వైసీపీ హయాంలో జగన్ చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేస్తే తెలంగాణలో తాను ఒక్కడినే ఆయన అరెస్ట్ కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టానని చెప్పారు. అంతే కాదు హైదరాబాద్ లో నిరసనలు తెలిపిన టీడీపీ కార్యకర్తలను ఆరోజు అడ్డుకోవద్దని అప్పటి మంత్రి కేటీఆర్‌కు, పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చానని కూడా ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పుకొచ్చారు. అంతే కాదు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ అని కూడా చెప్పారు.

ఎంతో నేర్చుకున్నా :

తాను చంద్రబాబు వద్దకు ఈరోజు వచ్చి ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం విశేషం. చాలా సేపు బాబు తాను అనేక విషయాలను చర్చించుకున్నామని చెప్పారు. అంతటితో అగకుండా అందరూ చంద్రబాబు పద్దతిలో పోవాలని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక సందేశం ఇచ్చి కారెక్కేశారు. ఇవన్నీ చూస్తున్న వైఎస్సార్ అభిమానులు అయితే హర్ట్ అవుతున్నారు అని అంటున్నారు. వైఎస్సార్ చంద్రబాబుల మధ్య రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆయన శిష్యులు కూడా అదే పద్ధతిలో ఉంటారు. ఇక కోమటిరెడ్డి అయితే కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నారు. ఇక బాబు ఎన్డీయేలో బీజేపీతో ఉన్నారు. ఆ విధంగా చూసినా ప్రత్యర్ధులు కిందనే లెక్క.

అయితే గ్లోబల్ మీట్ కి ఆహ్వానించడం అన్నది రాజకీయాలకు అతీతంగా మంచి పరిణామమే అని అంటున్నారు. కానీ అంతకు మించి బాబుని పొగడడం అదే సమయంలో వైఎస్ఆర్ తనయుడు జగన్ కి సూచనలు ఇవ్వడం ఆయన బాబుని అరెస్ట్ చేసిన దానికి వ్యతిరేకంగా తానే పెద్ద ఎత్తున నిరసనలు చేశాను అని చెప్పడం ఇవన్నీ అవసరమా అన్న చర్చ కూడా వైఎస్సార్ అభిమానులలో ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కోమటిరెడ్డి కూడా రేవంత్ రెడ్డి బాటలోనే వెళ్తున్నారని అంటున్నారు. మరి ఆయన మనసులో ఆలోచనలు ఏమిటి, ఆయన అతిథి దేవో భవా అని పొగిడారా లేక నిజంగా మనసులో నుంచి వచ్చిన మాటలేనా ఇవి అని కూడా వైఎస్సార్ ఫ్యాన్స్ అయితే చర్చిస్తున్నారు. ఏది ఏమైనా కోమటిరెడ్డి ఏపీకి వచ్చి వైఎస్సార్ ఫ్యాన్స్ ని బాగా ఇబ్బంది పెట్టారని అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యల ప్రభావం తెలంగాణాలో ఏమైనా ఉంటుందా అనేది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News