ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ కార్డు.. ఈసారి పక్కా.. !
ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. పనితీరు మెరుగు పడాలని.. ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా ఆయన చెబుతున్నారు.;
టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రులు, నాయకుల విషయంలో మరోసారి ప్రోగ్రెస్ కార్డులు రెడీ చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటి కే ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ కార్డులు ఇస్తామని చెప్పినా.. గతంలో వాయిదా పడింది. ఆ సమయంలో మంత్రుల పనితీరు వరకు భేరీజు వేసి వదిలేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల పనితీరుపై చర్చ వచ్చినా.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగోక పోవడం.. చాలా చోట్ల కొత్త నాయకులు ఉండడంతో ఈ విషయాన్ని అప్పట్లో పక్కన పెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా కలిపి ఒకేసారి ప్రోగ్రెస్ కార్డులు రెడీ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. పనితీరు మెరుగు పడాలని.. ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా ఆయన చెబుతున్నారు. మరీ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే పనితీరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. పింఛన్ల పంపిణీలో ఎన్నిసార్లు పాల్గొన్నారు? స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఎన్నిసార్లు హాజరయ్యారు? పబ్లిక్ గ్రీవెన్సెస్ ఎన్నిసార్లు నిర్వహించారు? సభ్యత్వ నమోదులో ఎన్నో స్థానంలో ఉన్నారు? ఇలా పలు విషయాల్లో ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నారు.
వీటిని ఆధారంగా చేసుకునే ఇప్పుడు ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వనున్నారు. వీటి ఆధారంగా వచ్చే ఏడాదికి వారి పని తీరు మార్చుకుని ఎన్నికల సమయానికి పూర్తిగా 100 శాతం మేరకు పనితీరులో మార్పు ప్రదర్శించాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆదిశాగా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని మూడు క్లస్టర్లుగా తీసుకుని ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తారు. ఉత్తరాంధ్ర, కోస్తాప్రాంతాలు, సీమ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేల పనితీరును ప్రత్యేకంగా అంచనావేస్తారు.
కేవలం పైన పేర్కొన్న అంశాలనే కాకుండా.. వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ఎలా స్పందించారన్నది ఆయా జిల్లాల్లో ఏర్పడిన పరిస్థితులను భేరీజు వేసి అంచనా వేస్తారు. అదేవిధంగా కూటమిలో కలివిడిగా ఉండడంతోపాటు.. వివాదాలకు దూరంగా ఉన్న నాయకులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా.. సుమారు 7-8 అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. వీటిలో పనితీరును బట్టి ఎమ్మెల్యేలకు మార్కులు వేయనున్నారు. దీనికి సంబంధించి ఐవీఆర్ ఎస్ సర్వే సహా.. ఐటీ నుంచి కూడా వివరాలు తీసుకునే పనిలో ఉన్నారు. వచ్చే సంక్రాతికి ముందే ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేయనున్నట్టు తెలిసింది.