పదో తరగతి పరీక్షలకు ఫీజు కట్టిన మంత్రి!

కూటమి ప్రభుత్వంలో బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తన పనితీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు అందుకుంటున్నారు.;

Update: 2025-12-06 13:30 GMT

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేకత చాటుకున్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తన పనితీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు అందుకుంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ బీజేపీ హైకమాండ్ లో పలుకుబడితో సత్యకుమార్ మంత్రి పదవి కైవసం చేసుకున్నారు. ఇలా మంత్రి అయిన ఆయన గత 18 నెలల్లో మంచి పనితీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేశారు. అదేవిధంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ప్రజల మనసు దోచుకునేలా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు సత్యకుమార్.

సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సత్యకుమార్ యాదవ్.. తన నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పరీక్ష ఫీజులను తానే చెల్లిస్తానని ప్రకటించారు. ధర్మవరం నియోజకవర్గంలో మొత్తం 2,087 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్నారు. ఈ విద్యార్థుల పబ్లిక్ పరీక్షల ఫీజును చెల్లిస్తానని మంత్రి విద్యాశాఖకు లేఖరాశారు. పదో తరగతి పరీక్ష ఫీజుగా ఒక్కొక్క విద్యార్థి రూ. 125 చొప్పున ఫీజును చెల్లించాలి. దీని ప్రకారం మొత్తం 2,087 మందికి రూ.2,60,875 మొత్తాన్ని చెల్లించాల్సివుంటుంది.

చదువులను ప్రోత్సహించాలనే ఆలోచనతో విద్యార్థుల పరీక్ష ఫీజులను చెల్లిస్తానని సత్యకుమార్ ప్రకటించారు. జిల్లా విద్యా శాఖ అధికారి ద్వారా అవసరమైన డబ్బును చెల్లించారు. మంత్రి ఫీజులు కట్టడంతో విద్యార్థుల వద్ద నుంచి డబ్బు వసూలు చేయొద్దని సూచిస్తూ డీఈవో స్కూళ్లకు సమాచారం పంపారు. ధర్మవరం నియోజకవర్గంలో బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లోని 41 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. త్వరలో పబ్లిక్ పరీక్షలు రాయ బోతున్న విద్యార్థుల ఫీజును వారికి ప్రోత్సాహకరంగా, ప్రేరణగా ఉండేందుకు మంత్రి చిరు ప్రయత్నంచేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పీటీఎం రోజునే మంత్రి విద్యార్థుల ఫీజులను చెల్లించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రులు తమ సొంత డబ్బులతో ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ తమ ప్రత్యేకత చాటుకుంటున్నారని అంటున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మెగా పీటీఎంలో పాల్గొన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం తన సొంత డబ్బుతో పాఠశాల గ్రంథాయాలనికి పుస్తకాలు, కంప్యూటర్లు సమకూర్చుతానని ప్రకటించారు.

Tags:    

Similar News