ఉద్యోగులు చచ్చిపోతే.. బీఆర్ ఎస్ సంబర పడింది: రేవంత్
దేవరకొండలో తొలుత 23 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేశారు.;
శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగం(ఎస్.ఎల్.బీ.సీ) తవ్వకాల సమయంలో పలువురు కార్మికులు, ఉద్యోగులు దురదృష్టవశాత్తు మృతి చెందారని.. అయితే.. దీనిని కూడా బీఆర్ ఎస్ సంబరాలకు వినియోగించుకుందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి వల్లే.. రాష్ట్రం వెనుకబడిందన్నారు. కేసీఆర్ దిగిపోయిన తర్వాత.. రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని చెప్పారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల సభకు సీఎం రేవంత్ హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ ఎస్ పాలన.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు.
ఎస్.ఎల్.బీ.సీ పూర్తయి ఉంటే నల్లగొండ ప్రజలకు దాహార్తి తీరేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ, దీనిని కాంగ్రెస్ హయాంలో చేపట్టామన్న దుగ్ధతో కేసీఆర్ ప్రభుత్వం గత పదేళ్లు ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదన్నారు. దురదృష్టవశాత్తు ఈ ఎస్.ఎల్.బీ.సీలో ప్రమాదం జరిగి కొందరు చనిపోతే.. దానిని కూడా సంబరాలు చేసుకునేందుకు వాడుకున్నారని దుయ్యబట్టా రు. తమహయాంలో ఎస్.ఎల్.బీ.సీని పూర్తి చేసి నల్లగొండకు నీరిస్తామని.. ఇక్కడి ఫ్లోరైడ్ సమస్య గత కొన్ని దశాబ్దాలుగా ఉందని.. దీనిని కూడా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
దేవరకొండలో తొలుత 23 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. అనంత రం నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... కేసీఆర్ కారణంగానే రాష్ట్రంలో ఇంకా సమస్యలు ఉన్నాయని తెలి పారు. గత 20 నెలల తమ పాలనలో ప్రతి ఇంటికీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం సాకారంలో భాగంగానే పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. లంబాడాల సుదీర్ఘ డిమాండ్ అయిన.. ఎస్టీ హోదా విషయంలో కూడా కేసీఆర్ మోసం చేశారని.. కానీ తాము రాగానే దానిని సాకారం చేశామని చెప్పారు.
కేసీఆర్‌కు సవాల్!
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీసీఎం కేసీఆర్‌కు సవాల్ రువ్వారు. బీఆర్ ఎస్ హయాంలో ఎంత మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించాలని కోరారు. ``గత పదేళ్లలో ఎంతమంది పేదలకు ఇళ్లు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలి`` అని రేవంత్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగున్నర లక్షల మంది పేదలకు ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు.
రైతులు సహా పేదలు కూడా కేసీఆర్ పాలనలో తీవ్రంగా నష్టపోయారని.. ఇప్పుడు వారంతా కాంగ్రెస్ వెంటే ఉన్నారని.. వారి మేలు కోసం ఎన్నో చేస్తున్నామని వివరించారు. ఇదేసమయంలో కేసీఆర్ తన ఇంటికి వెవరినీ రానిచ్చేవారు కాదని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా ఆయన అవమానించారని ఎద్దేవా చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం ఎన్నికలు రాగానే.. పంచాయతీ మెంబర్లను పక్కన కూర్చోబెట్టుకుని ఆశీర్వదిస్తున్నాడని.. ఈ తేడాను అందరూ గమనించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.