రష్యాకు ఉక్రెయిన్ డ్రోన్ల భయం ఏ స్థాయిలో ఉందంటే...!

అవును... గత నాలుగు రోజులుగా రష్యా సుమారు 150 యుద్ధనౌకలతో విన్యాసాలు నిర్వహించింది.;

Update: 2025-07-28 08:30 GMT

రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో జూన్ మొదటివారంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ తన డ్రోన్ లతో పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. దీంతో.. ఇంత భారీ మొత్తంలో ఉక్రెయిన్ దాడులకు పాల్పడటం ఇదే తొలిసారని అంటున్నారు. ఈ దాడుల్లో సుమారు 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి.

దీనికి ఆపరేషన్‌ 'స్పైడర్‌ వెబ్‌' అని జెలెన్ స్కీ నామకరణం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఉక్రెయిన్ డ్రోన్‌ దాడుల భయంతో రష్యా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఆదివారం తన యుద్ధనౌకల పరేడ్‌ లను రద్దు చేసినట్లు వెల్లడించింది. భద్రతాపరమైన అంశాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.

అవును... గత నాలుగు రోజులుగా రష్యా సుమారు 150 యుద్ధనౌకలతో విన్యాసాలు నిర్వహించింది. నేవీ డే వార్షిక వేడుకలు పురస్కరించుకుని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌, కాలినిన్‌ గ్రాడ్‌, వ్లాదివొస్తొక్‌ లలో యుద్ధనౌకల పరేడ్‌ నిర్వహించాలని భావించిందని చెబుతున్నారు. అయితే.. భద్రతాపరమైన కారణాలతో అధికారులు వీటిని రద్దు చేశారు. అందుకు కారణం ఉక్రెయిన్ డ్రోన్స్ అని అంటున్నారు.

ఈ క్రమంలో... ప్రస్తుతం సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ లో పర్యటిస్తున్న వ్లాదిమిర్ పుతిన్‌.. నేవీ హెడ్‌ క్వార్టర్స్‌ ను సందర్శించారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... నౌకాదళ విన్యాసాల గురించి ఆరా తీశారు. ఈ నేపథ్యంలో.. మరిన్ని యుద్ధనౌకలు నిర్మిస్తామని, నేవీ శిక్షణను ముమ్మరం చేస్తామని.. తద్వారా పోరాట సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు.

మరోవైపు.. ఉక్రెయిన్‌ ప్రయోగించిన సుమారు 99 డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆదివారం సెయింట్ పీటర్స్‌ బర్గ్ సమీపంలో మరిన్ని డ్రోన్లను ధ్వంసం చేసినట్లు చెప్పింది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి వచ్చే డ్రోన్ల ముప్పుతో సెయింట్ పీటర్స్‌ బర్గ్‌ లోని పుల్కోవో విమానాశ్రయం ఆదివారం తెల్లవారుజామున పదుల కొద్ది విమానాలను నిలిపివేసింది.

ఇక... ఆదివారం కూడా రష్యా డ్రోన్, క్షిపణులతో ఉక్రెయిన్‌ పై దాడి చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌ లోని ఈశాన్య ప్రాంతంలోని సుమీలో, పౌర మౌలిక సదుపాయాలు, పరిపాలనా భవనం, నివాసేతర ప్రాంగణాలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళా ఉన్నారు!

Tags:    

Similar News