త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. ఉదయనిధి అరెస్ట్.. అత్యవసర విచారణ?
టీవీకే పార్టీ ఫిర్యాదు మేరకు చెన్నైలోని నీలంకరైలో ఉన్న ఉదయనిధి నివాసానికి చేరుకున్న పోలీసులు మంగళవారం ఆయనను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.
డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తాజాగా ప్రముఖ సినీనటి త్రిషను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కి అధికార పార్టీ టీవీకే ఫిర్యాదు చేసింది. బహిరంగ సభలలో ఆడవారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు అని, వెంటనే ఉదయనిధి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ పై కేసు ఫైల్..
టీవీకే పార్టీ ఫిర్యాదు మేరకు చెన్నైలోని నీలంకరైలో ఉన్న ఉదయనిధి నివాసానికి చేరుకున్న పోలీసులు మంగళవారం ఆయనను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. తంజావూరులో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై టీవీకే మహిళా వింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంజావూరు పోలీసులు ఐటి చట్టంలోని నిబంధనలతో సహా మొత్తం 6 సెక్షన్ల కింద ఉదయనిధి స్టాలిన్ పై కేసు నమోదు చేశారు .
మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన డీఎంకే న్యాయవాద బృందం.. అత్యవసర విచారణ!
ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయనిధికి రక్షణ కల్పించాలని కోరుతూ.. డీఎంకే న్యాయవాద బృందం ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తంజావూరు డీఎస్పీ అలగేసన్ నేతృత్వంలోని పోలీస్ బృందం చెన్నై పోలీస్ కమిషనర్ ఏ. అమల్ రాజ్ ఉదయనిధి ఇంటికి చేరుకొని కేసు వివరాలను తెలియజేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే భారీ సంఖ్యలో డిఎంకె కార్యకర్తలు, ఆయన నివాసం వద్దకు చేరుకొని నినాదాలు చేయడంతో అక్కడ భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ డిఎంకె నేతలు కేఎన్ నెహ్రూ, మా. సుబ్రమణియన్ తదితరులు అక్కడికి చేరుకొని అధికారులతో చర్చలు జరిపారు. ఇక హైకోర్టును ఆశ్రయించిన డీఎంకే నేతలకు ఉదయనిధి స్టాలిన్ పై ఫైల్ అయిన కేసుకు సంబంధించి అత్యవసర విచారణ నేడు మధ్యాహ్నం జరగనుంది. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
అసలు వివాదం ఏంటి?
అసలు వివాదం విషయానికి వస్తే.. సోమవారం తంజావూర్ లోని పనగల్ బిల్డింగ్ వద్ద కావేరి జలాల హక్కులు, మేకెదాటు ప్రాజెక్టు, రైతు రుణమాఫీ వంటి పలు అంశాల పైన జరిగిన డీఎంకే నిరసన సభలో ఉదయనిధి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో డిఎంకె పార్టీ కార్యకర్తలు నటి త్రిష పేరును ప్రస్తావించగా.. ఆయన కార్యకర్తలను ఆపే ప్రయత్నం చేయకుండా.. "ఎక్కడ నీళ్లు వచ్చినా రాకపోయినా.. అక్కడ వస్తాయంటూ" చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే వెంటనే అప్రమత్తమైన ఉదయనిధి తాను కావేరి నది జలాలను ఉద్దేశించి కామెంట్లు చేశాను అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు.