తేల్చుకుందాం రా.. విజయ్‌కు బిగ్ బాస్ జూలీ ఛాలెంజ్!
తమిళనాడులో రాజకీయం టీవీకే అధినేత విజయ్ చుట్టూ తిరుగుతోంది. 234 స్థానాల్లో విజయ్ పార్టీ టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోంది.;
తమిళనాడులో రాజకీయం టీవీకే అధినేత విజయ్ చుట్టూ తిరుగుతోంది. 234 స్థానాల్లో విజయ్ పార్టీ టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోంది. ఆయన కూడా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకు అధికార పార్టీతోపాటు కొందరు సెలబెట్రీలు సవాల్ విసురుతున్నారు. ప్రధానంగా జల్లికట్టు ఉద్యమకారిణి, బిగ్ బాస్ ఫేమ్ జూలీ పెరంబూర్ లో విజయ్ కి వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. అంతేకాకుండా పంచ్ డైలాగులతో ఆమె విజయ్ పై విమర్శలు గుప్పిస్తూ పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తున్నారు.
విజయ్ పోటీ చేస్తున్న పెరంబూర్ రాజకీయం ఇప్పుడు రణ రంగాన్ని తలపిస్తోంది. విజయ్ కి వ్యతిరేకంగా బిగ్ బాస్ ఫేమ్ జూలీ నియోజకవర్గంలో అడుగుపెట్టడమే కాకుండా, నేరుగా విజయ్‌నే టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. "విజయ్ అన్నా.. తేల్చుకుందాం రా!" అంటూ ఆమె విసిరిన సవాల్ ఇప్పుడు తమిళనాడు అంతటా మారుమోగిపోతోంది. "నువ్వు మా అన్నవే.. కానీ పాలిటిక్స్‌లో కాదు!" అంటూ జూలీ తన ప్రచారంలో విజయ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమ్మురేపుతున్నాయి.
విజయ్ ని టార్గెట్ చేసిన జూలీ ‘అన్నా.. నిన్ను వెండితెరపై హీరోగా చూసి మేమంతా మురిసిపోయాం. మా ఇంట్లో అన్నయ్యగా నిన్ను గౌరవించాం. కానీ రాజకీయ క్షేత్రంలోకి వస్తే నువ్వు మాకు ప్రత్యర్థివే. ఇక్కడ సినిమా డైలాగులు పని చేయవు. ప్రజల కష్టాలు తెలిసిన మా లాంటి వాళ్లం వచ్చాం.. ఇక తేల్చుకుందాం రా!’ అంటూ జూలీ చేసిన ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది. కేవలం విమర్శలు చేయడమే కాకుండా, పెరంబూర్ వీధుల్లో తిరుగుతూ విజయ్ పట్ల ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఏసీ గదుల్లో కూర్చుని పార్టీ పెట్టినంత మాత్రాన నాయకుడు అయిపోరు. ఎండలో తిరిగి ప్రజల కన్నీళ్లు తుడిచిన వారే నిజమైన నాయకులు అంటూ ఆమె విజయ్ 'స్టార్ ఇమేజ్'ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, జూలీ వ్యాఖ్యలపై విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. "అన్నయ్య స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంటి?" అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
అయితే, జూలీ మాత్రం వీటికి భయపడే ప్రసక్తే లేదని, పెరంబూర్ గడ్డపై విజయ్‌ను ఓడించడమే తన లక్ష్యమని భీష్మించుకుని కూర్చున్నారు. కాగా, బిగ్ బాస్ ఫేమ్ జూలి టీవీకే అధినేత విజయ్ ని ఈ స్థాయిలో వ్యతిరేకించడానికి కారణం ఏంటి అన్న చర్చ హీట్ పుట్టిస్తోంది. విజయ్ ఓటమికి కంకణం కట్టుకున్నానని చెబుతున్న జూలి నేపథ్యం తెలుసుకోడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
జూలీ అసలు పేరు మరియా జూలియానా. వృత్తిరీత్యా నర్సు అయిన ఆమె, 2017లో జరిగిన జల్లికట్టు ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చారు. చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన నిరసనల్లో ఆమె మైక్ పట్టుకుని ప్రభుత్వానికి, పీటా సంస్థకు వ్యతిరేకంగా ఇచ్చిన నినాదాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ఆమెను తమిళ ప్రజలు ఒక 'వీర తమిళాచ్చి' (ధైర్యవంతురాలైన తమిళ మహిళ)గా కొనియాడారు. జల్లికట్టు ఉద్యమం తెచ్చిన పాపులారిటీతో ఆమెకు తమిళ బిగ్ బాస్ సీజన్-1 లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత 'బిగ్ బాస్ అల్టిమేట్' లో కూడా ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించారు. అమ్మన్ తాయి వంటి చిత్రాల్లో నటించారు. కొన్ని టీవీ షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు.