తువాలు: ప్రపంచానికి ముంచుకొస్తున్న ప్రమాదం
ప్రపంచ దేశాలు ఆర్థిక వృద్ధి, సంపద సృష్టిలో నిమగ్నమై ఉండగా, కొన్ని చిన్న దేశాలు మాత్రం తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నాయి.;
ప్రపంచ దేశాలు ఆర్థిక వృద్ధి, సంపద సృష్టిలో నిమగ్నమై ఉండగా, కొన్ని చిన్న దేశాలు మాత్రం తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అత్యంత చిన్న దేశాల్లో ఒకటైన తువాలు ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే.. అది సముద్రంలో మునిగిపోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
-సముద్ర మట్టానికి కేవలం రెండు మీటర్ల ఎత్తులో ఉన్న దేశం
తువాలు దేశం సాధారణంగా సముద్ర మట్టానికి కేవలం 2 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో సముద్ర మట్టం నిరంతరం పెరుగుతోంది. నాసా అంచనా ప్రకారం, సముద్ర మట్టం మరో 15 సెంటీమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల మంచినీటి వనరులు కలుషితమై, సముద్రపు నీరు భూమిలోకి చొచ్చుకుపోతోంది. ప్రజల జీవనాధారాలైన చేపలు, కొబ్బరి తోటలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
-'ఫాలేపిలీ యూనియన్ ఒప్పందం' వలసకు మార్గం
ఈ విషమ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, తువాలు దేశం తన పొరుగున ఉన్న ఆస్ట్రేలియాతో ఫాలేపిలీ యూనియన్ ట్రీటీ అనే ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తువాలు వాసులకు ఆస్ట్రేలియాలో విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. ఇప్పటికే 8,750 మంది తువాలు ప్రజలు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. వీరికి లాటరీ పద్ధతిలో వీసాలు మంజూరు అయ్యాయి.
-మానవ తప్పిదమే కారణం
పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ దుస్థితికి ప్రధాన కారణం భూతాపం, అస్తవ్యస్తమైన పట్టణీకరణ, సహజ వనరుల దుర్వినియోగం. మంచుకొండలు వేగంగా కరిగిపోవడం వల్ల సముద్ర మట్టం పెరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, తువాలుతో పాటు బంగ్లాదేశ్, మాల్దీవులు, ఫిజీ వంటి దేశాలు కూడా సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉంది.
-ప్రపంచానికి తువాలు సందేశం
తువాలు దేశం ప్రపంచానికి ఇచ్చే హెచ్చరిక చాలా స్పష్టంగా ఉంది. "ఇంకా సమయం ఉంది, పర్యావరణంపై శ్రద్ధ పెట్టండి, గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రించండి." లేకపోతే భవిష్యత్తులో మరిన్ని దేశాలు ప్రపంచ పటాల నుంచి అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది.
ఒక గ్రామం కాదు, ఒక జిల్లా కాదు, ఒక దేశం సముద్రంలోకి కనుమరుగవుతున్న ఈ విషాదకరమైన సంఘటన మనలో ప్రతి ఒక్కరిలోనూ ఆలోచన రేకెత్తించాలి. పర్యావరణ పరిరక్షణ కేవలం ఉద్యమాలు చేయడమే కాదు, మన జీవనశైలిలో మార్పులు తీసుకురావడమే అత్యవసరం. తువాలు అనుభవం నుంచి మనం మేల్కొనాలి, అది మన భవిష్యత్తుకు చాలా అవసరం.