ట్రంప్ పన్నుల షాక్.. స్టీల్, అల్యూమినియం పై 50శాతం టారిఫ్..భారత్‎కు దెబ్బ తప్పదా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవిలో ప్రపంచ దేశాలపై భారీ టారిఫ్‌లతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.;

Update: 2025-06-05 03:00 GMT

ప్రపంచ వాణిజ్య రంగంలో మరోసారి కలకలం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ఉక్కు, అల్యూమినియం పరిశ్రమల భవిష్యత్తును పరిరక్షించాలన్న ఉద్దేశంతో దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియం పై టారిఫ్‌లను భారీగా పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో 25శాతం ఉన్న ఈ సుంకాన్ని ఏకంగా 50శాతానికి పెంచడం భారతీయ ఎగుమతిదారులకు ఆందోళన కలిగిస్తోంది. భారతదేశం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4.56 బిలియన్ డాలర్ల (సుమారు రూ.38,000 కోట్లు) విలువైన ఇనుము, ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. ఈ పెంపుదల భారతీయ స్టీల్, అల్యూమినియం పరిశ్రమలకు తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

జూన్ 4 నుంచి అమలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవిలో ప్రపంచ దేశాలపై భారీ టారిఫ్‌లతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అధ్యక్ష పదవిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియంపై 25శాతం ఉన్న సుంకాన్ని ఏకంగా 50శాతానికి పెంచారు. ఈ పెంపుదల జూన్ 4, 2025 (బుధవారం) నుండి అమల్లోకి వచ్చింది. అమెరికా జాతీయ భద్రత, దేశీయ పరిశ్రమలను రక్షించడానికి ఈ చర్య అత్యంత కీలకమని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, బ్రిటన్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో, ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వాటిపై 25శాతం టారిఫ్ మాత్రమే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

టారిఫ్‌ల చరిత్ర

2016 నుంచి 2020 వరకు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25శాతం టారిఫ్‌లు విధించారు. అయితే, ఆ తర్వాత కెనడా, మెక్సికో, బ్రెజిల్ వంటి వాణిజ్య భాగస్వాములకు సుంకాలు లేకుండా కోటాలను అందించారు. బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోటాలను బ్రిటన్, జపాన్, యూరోపియన్ యూనియన్‌లకు కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ప్రారంభంలో రెండోసారి అధ్యక్ష పదవిలోకి వచ్చిన ట్రంప్, మరోసారి స్టీల్, అల్యూమినియంపై టారిఫ్ బాంబును వేశారు. ఏ దేశానికీ ఎలాంటి మినహాయింపు ఇవ్వకుండా 25శాతం టారిఫ్‌లు విధించాలని ఏప్రిల్ 2న నిర్ణయించారు. తాజాగా దీనిని 50శాతానికి రెట్టింపు చేశారు. ఈ నిర్ణయం అమెరికాలో గృహాలు, వాహనాలు, ఇతర వస్తువులను తయారు చేయడానికి దిగుమతి చేసుకునే లోహాల ధరలను పెంచుతుంది.

భారత్ కు ఎదురుదెబ్బ

అధికారిక గణాంకాల ప్రకారం..ప్రస్తుతం అమెరికా దిగుమతి చేసుకునే స్టీల్ ఉత్పత్తులలో ఎక్కువ భాగం కెనడా, బ్రెజిల్, మెక్సికో నుండి వస్తున్నాయి. ఈ జాబితాలో దక్షిణ కొరియా, వియత్నాం కూడా ఉన్నాయి. అల్యూమినియం విషయానికి వస్తే, కెనడా అమెరికాకు అతిపెద్ద సరఫరాదారు. 2024లో అమెరికా దిగుమతి చేసుకున్న మొత్తం అల్యూమినియంలో దాదాపు 79శాతం కెనడా నుంచే వచ్చింది.

అమెరికా స్టీల్ మరియు అల్యూమినియం దిగుమతులపై 50శాతం టారిఫ్ విధించడం వల్ల భారతీయ ఎగుమతిదారులపై కూడా ప్రభావం చూపుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం అమెరికాకు 4.56 బిలియన్ డాలర్ల (సుమారు రూ.38,000 కోట్లు) విలువైన ఇనుము, ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులను ఎగుమతి చేసింది.

Tags:    

Similar News