ట్రంప్ ఉచిత భోజనానికి మునీర్ ఎంత చెల్లించబోతున్నారు..?

అయితే... ట్రంప్ ఎవరికీ ఉచితంగా భోజనం పెట్టరని.. ఈ 'ప్రేమ' విందు వెనుక ట్రంప్ లెక్కలు పెద్దగానే ఉంటాయని చెబుతున్నారు.;

Update: 2025-06-21 13:30 GMT

అవ్వడానికి రాజకీయ నాయకుడే అయినప్పటికీ.. ట్రంప్ ఆలోచనలు ఎప్పుడూ వాణిజ్య పరంగానూ, వ్యాపార కోణంలోనే ఉంటాయని.. ప్రపంచ దేశాలతో ఆయన వ్యవహార శైలి అలాగే ఉంటుందని.. అది గ్రహించిన వారు సేఫ్ అవ్వగా.. అది గ్రహించలేనివారు ఆయన చేతిలో బలిపశువు అవుతుంటారని.. ట్రంప్ ఎవరికీ ఉచితంగా భోజనం పెట్టరని చెబుతుంటారు పరిశీలకులు.

అవును... ట్రంప్ కు ఉన్నపలంగా పాకిస్థాన్ పై ప్రేమ పుట్టుకొచ్చేసింది. దీంతో.. పాకిస్థాన్ అనధికారిక నియంత, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్ ను భోజనానికి ఆహ్వానించారు. ఆ సమయంలో అమెరికాలోని పాక్ పౌరుల నుంచి మునీర్ కు ఘోర అవమానం జరిగిన సంగతి కాసేపు పక్కనపెడితే.. ట్రంప్ తో వింధు విషయంలో మునీర్ మాత్రం ఎగిరి గంతేశారని అంటారు.

అయితే... ట్రంప్ ఎవరికీ ఉచితంగా భోజనం పెట్టరని.. ఈ 'ప్రేమ' విందు వెనుక ట్రంప్ లెక్కలు పెద్దగానే ఉంటాయని చెబుతున్నారు. ఈ సడన్ లవ్ కు కారణం.. ఇజ్రాయెల్ తో ఇరాన్ కు జరుగుతున్న యుద్ధంలో తాను ఎంట్రీ ఇవ్వడానికి ఫీల్డింగ్ సెట్ చేసుకునే ప్రయత్నమే అని అంటున్నారు. దీంతో.. ముస్లిం దేశాల మధ్య పాక్ ను బలిపశువు చేయనున్నారని చెబుతున్నారు.

ప్రస్తుతం ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు అణు ఒప్పందం విషయంలో ఇరాన్ ను ట్రంప్ బెదిరిస్తూనే ఉన్నారు. అయితే.. ఎంత చెప్పినా, ఎన్ని అవకాశాలిచ్చినా.. ఇరాన్ మాత్రం ట్రంప్ ముందు తలొగ్గేలా కనిపించడం లేదు. ఇటీవల ట్రంప్ వ్యాఖ్యలపై స్పందింస్తూ.. 'యుద్ధం మొదలైంది' అని ఇరాన్ వెల్లడించింది.

దీంతో.. ఇరాన్ పై దాడి చేయడానికి ట్రంప్ ఫీల్డింగ్ సెట్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... ఇప్పటికే వాషింగ్టన్ కు "డూమ్స్ డే ప్లేన్"ను తరలించారు. మరోవైపు పశ్చిమాసియా సరిహద్దుల్లో ఆయుధాలు మొహరిస్తున్నట్లు కథనాలొస్తున్నాయి. ఇదే సమయంలో.. బంకర్ బ్లస్టర్ బాంబులను సిద్ధం చేస్తున్నట్లు కథనాలొస్తున్నాయి.

ఈ సమయంలో... ఇరాన్ తో సుమారు 900 కి.మీకంటే ఎక్కువ పొడవైన సరిహద్దును కలిగి ఉన్న పాకిస్థాన్ లోనూ ఫీల్డింగ్ సెట్ చేస్తే.. క్షిపణి ప్రయోగాలకు సులువుగా ఉంటుందని ట్రంప్ భావించారని అంటున్నారు. అందుకే మునీర్ కు ఈ విందు కార్యక్రమం అని.. మునీర్ ను పాక్ లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా కొనియాడటం అని చెబుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఇరాన్ పై అమెరికా దాడికి పాకిస్థాన్ సహకరిస్తే.. అది ప్రపంచంలోని ముస్లిం దేశాల ముందు బలిపశువయ్యే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల 21 ముస్లిం దేశాలు.. ఇరాన్ కు మద్ధతుగా ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అందులో పాకిస్థాన్ కూడా ఉంది!

అదే పాకిస్థాన్.. ఇప్పుడు అదే ఇరాన్ పై దాడులు చేయడానికి అమెరికాకు తమ భూభాగాన్ని అప్పగిస్తే పరిస్థితి ఏమిటనేది ఇక్కడ కీలకం. ఇరాన్ తో యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా తనంతట తాను థాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత పాకిస్థాన్ పరిస్థితి ఏమిటి? ట్రంప్ ఇచ్చిన ఉచిత భోజనానికి మునీర్ చెల్లించబోయే విలువ ఎంత?

మోడీ దగ్గర ట్రంప్ ఆటలు సాగలేదు!:

వాస్తవానికి ఇరాన్ పై దాడుల విషయంలో భారత్ ను కూడా ట్రంప్ వాడుకోవాలనో.. కనీసం నైతిక మద్దతు కూడగట్టాలనో ప్రయత్నాలు చేసినట్లు చెబుతారు. ఇందులో భాగంగానే... జీ7 సదస్సుకు హాజరైన మోడీని.. వాషింగ్టన్ వచ్చి వెళ్లమని ట్రంప్ పిలిచారు. వైట్ హౌస్ లో విందుకు ఆహ్వానించారు. అయితే.. మోడీ ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు.

తాజాగా ఈ విషయాన్ని స్వయంగా మోడీ వెల్లడించారు. ఇందులో భాగంగా.. తాజా జీ7 సదస్సులో భాగంగా కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు వాషింగ్టన్ కు రావాలని డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారని.. డిన్నర్ ఇన్విటేషన్ ఇచ్చారని.. అయితే తాను ట్రంప్ ఇన్విటేషన్ కు నో చెప్పినట్లు ప్రధాని వెల్లడించారు.

Tags:    

Similar News