భారత్ - పాక్ అణు యుద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
అవును... భారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు శనివారం ముగిసిన సంగతి తెలిసిందే.;
భారత్ – పాక్ మధ్య ఆపరేషన్ సిందూర్ అనంతరం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమన శనివారం సాయంత్రం కుదిరింది. అయితే.. అదంతా అమెరికా మధ్యవర్తిత్వ ఫలితమే అంటూ ఈ ఇరుదేశాల కంటే ముందే ప్రకటించారు ట్రంప్. ఈ నేపథ్యంలో ఆ ఇరు దేశాలనూ ఎలా ఒప్పించింది చెప్పారు.
అవును... భారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు శనివారం ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ ఇరుదేశాలు కాల్పుల విరమన ప్రకటించాయి. అయితే.. దీనికోసం తాను రాత్రంతా సుదీర్ఘ చర్చలు జరిపినట్లు ట్రంప్ తెలిపారు. ఈ సమయంలో ఆ రెండు దేశాలనూ ఒప్పించడానికి తాను ఏమి చేసింది.. ఎలా చేసింది చెప్పుకొచ్చారు ట్రంప్.
సోమవారం విలేకరుల సమావేశంలో స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం చేయడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందని నొక్కి చెప్పారు. ఈ సమయంలో.. ఆ రెండూ దేశాల మధ్య అణు యుద్ధం జరగకుండా నివారించడానికి తన దౌత్యం ఎంతో సహాయపడిందని తెలిపారు.
ఈ సందర్భంగా... చాలా అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య ప్రమాదకరమైన సంఘర్షణను తన ప్రభుత్వ మధ్యవర్తిత్వం వల్ల ముగించడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాము ఒక అణు యుద్ధాన్ని ఆపామని.. ఆ అణుయుద్ధమే జరిగి ఉంటే లక్షలాది మంది చనిపోయి ఉండేవారని.. అలాంటి చెడ్డ అణు యుద్ధాన్ని ఆపినందుకు తాను చాలా గర్వపడుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రెండు దేశాల నాయకత్వాన్ని ప్రశంసించిన ట్రంప్... భారత్, పాక్ నాయకత్వం దృఢంగా, శక్తివంతంగా ఉందని తెలియజేయడానికి తాను చాలా గర్వపడుతున్నట్లు తెలిపారు. వారికి పరిస్థితిని అర్ధం చేసుకునే శక్తి, జ్ఞానం, ధైర్యం నిజంగా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే వారితో చాలా వాణిజ్యం చేస్తామని, యుద్ధం ఆపాలని చెప్పి ఒప్పించినట్లు తెలిపారు.