ట్రంప్ తీరును చూస్తే.. తెలుగు సినిమాలు గుర్తుకు రావట్లేదు

ఈ సినిమాల్ని చూసినప్పుడు కలిగే సందేహం ఒక్కటే. నిజజీవితంలో.. వాస్తవ ప్రపంచంలో ఇది సాధ్యమేనా? అని.;

Update: 2026-03-22 05:46 GMT

రోటీన్ తెలుగు సినిమాల్నిఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే.. అదో ఊరు. ఆ ఊళ్లో భయంకరమైన విలన్ ఉంటాడు.వాడి దారుణాలు ఏళ్లకు ఏళ్లు సాగుతుంటాయి. ఆ ఊళ్లో వాళ్లు బలంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ.. ఆ విలన్ ను ఎదిరించి పోరాడే దమ్ము మాత్రమే కాదు గట్టిగా మాట్లాడేందుకు సైతం ధైర్యం లేనివాళ్లు. వాడు ఎవరినైనా టార్గెట్ చేస్తాడు. ఏమైనా చేస్తాడు. కానీ.. ఎవరూ ఏమీ అనరు. అలాంటి పరిస్థితుల్లో ఒక హీరో ఎంట్రీ ఇస్తాడు. అప్పటివరకు విలన్ వైపు కన్నెత్తి చూసేందుకు సైతం భయపడే వాళ్లకు భిన్నంగా.. ఆ హీరో ఎదురెళతాడు. మాటకుమాట చెప్పటమే కాదు.. విలన్ దారుణాలకు చెక్ పెట్టేస్తాడు. అతడికి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడతారు.. కట్ చేస్తే.. ఈ తరహా సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. పాతికేళ్లున్న కుర్రాడు సైతం ఈ తరహా సినిమాలు తక్కువలో తక్కువ వందకు పైనే చూసి ఉంటాడు.

ఈ సినిమాల్ని చూసినప్పుడు కలిగే సందేహం ఒక్కటే. నిజజీవితంలో.. వాస్తవ ప్రపంచంలో ఇది సాధ్యమేనా? అని. సినిమాలలో మాదిరి విలన్ వేధించుకుతింటుంటే.. పాతిక మంది కలిసి ఏసేస్తారు అన్న ఆలోచన కూడా వస్తుంది. అసలు అంత బలంగా ఉన్న ఆ ఊరి వాళ్లు.. వాడిని ఏళ్లకు ఏళ్లుగా భరించాల్సిన అవసరం ఏముంది? అందరూ కలిస్తే.. ఎంతసేపు? లాంటి ఆలోచనలు.. అంతకు మించిన ఆవేశం వస్తుంది. ఆవేశం రావటంతో తప్పు లేదు. కానీ.. వాస్తవ ప్రపంచంలో అలాంటివి ఉండవనుకోవటంలోనే అసలు తప్పంతా.

అదెలా అంటారా? విలన్ లాంటి చెడుమాటలు అనాల్సిన అవసరం లేదు. అమెరికా లాంటి అగ్రరాజ్యానికి తనకు తన ప్రయోజనాలే ముఖ్యం. ప్రపంచ పెద్దన్న హోదాలో మిగిలిన ప్రపంచ దేశాల మనుషులు.. తమ దేశస్తుల మాదిరి అస్సలు అనుకోరు. అలా అనుకోవటానికి వారి మనసు ఒప్పుకోదు. ఆ దేశాన్ని పాలించే అధ్యక్షుడు ప్రపంచ హీరోగా పరిగణించేటోళ్లు కోట్లాది మంది ఉంటారు. అలాంటి కుర్చీలో ట్రంప్ లాంటి పెద్ద మనిషి కూర్చున్నప్పుడు ఒక్కసారి మన తెలుగు సినిమాలో చూసేలాంటి వాతావరణం మొదలవుతుంది.

తాను అనుకున్నది అనుకున్నట్లు చేసేయగలడు. రాత్రికి రాత్రి ఒక దేశంపై మెరుపుదాడి చేసి.. ఆ దేశాధ్యక్షుడ్ని.. అతడి భార్యను ఎత్తుకు వచ్చేయొగలడు. ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుంది. కిడ్నాప్ లాంటి భయంకరమైన మాటల్ని ప్రపంచ ప్రజలు తర్వాత.. ప్రపంచంలోని దేశాలు సైతం చూస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఏ దేశానికి ఆ దేశ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. అలాంటప్పుడు తప్పును.. తప్పుగా ఎత్తి చూపాల్సిన అవసరం లేదు.

ఏదైనా దేశంలో సహజవనరులు పుష్కలంగా ఉండి.. దాన్ని తాను కోరుకున్న రీతిలో ఇచ్చేందుకు ఏ దేశమైనా నో చెబితే.. ఆ దేశం మీద ఒక్కొక్క ఆరోపణను ఫ్రేం చేసి.. మొత్తానికి దానికో ట్యాగ్ తగిలించి.. ఆ దేశం మీద దాడి చేసి.. ఆ దేశ ప్రజల బతుకుల్ని ఆగమాగం చేసి.. ఆ దేశాన్ని సొంతం చేసుకోవటం.. లేదంటే ఆ దేశంలో తాము చెప్పిందే జరగాలన్న పరిస్థితుల్ని కల్పించటం లాంటివి అమెరికా లాంటి అగ్రరాజ్య అధినేతలు చేసేదే. కాకుంటే.. గతంలో ఇలాంటివి జరిగేందుకు సంవత్సరాల సమయం తీసుకునే వారు.కానీ.. ఇప్పుడు నడిచేది డిజిటల్ యుగం.. సోషల్ మీడియాప్రపంచం. ఇలాంటి వేళ.. వేగం చాలా ప్రధానం. అందుకే.. ట్రంప్ లాంటి పెద్ద మనిషి.. గత అధ్యక్షులు దశాబ్ద కాలం పట్టే పరిస్థితుల్ని సింఫుల్ గా సంవత్సరం కంటే తక్కువ సమయంలో చేసి పారేస్తున్న పరిస్థితి.

ఇరాన్ తో చేస్తున్న యుద్ధం సంగతే తీసుకుంటే.. ఇదే విషయం బోధ పడుతుంది. తాను ప్లాన్ చేసి యుద్ధానికి దిగినప్పుడు.. దాని కారణంగా ప్రపంచం పడే తిప్పల గురించి అస్సలు ఆలోచించడు. చివరకు తనను ఎన్నుకున్న తన దేశ ప్రజలు చెప్పేది కూడా పెద్దగా వినిపించుకోడు. ఎప్పుడైనా అంతేగా? ప్రపంచాన్ని శాసించేసే పరిస్థితి తన చేతుల్లో ఉందన్న విషయాన్ని బలంగా నమ్మేటప్పుడు.. తన చర్యల్ని ఇప్పటికి కోట్లాది మంది అమెరికన్లు మద్దతుగా నిలిచినప్పుడు.. తనను వ్యతిరేకించే ఇంకొన్ని కోట్ల అమెరికన్ల మాటలు వినిపించే అవకాశం ఉండదు.

విచిత్రమేమంటే.. అతడి తీరును ప్రపంచ దేశాలు.. బలమైన దేశాలు సైతం తమ ప్రయోజనాలు.. తమ దేశ ప్రజల కోణంలో ఆలోచిస్తాయి. ప్రపంచ శాంతి.. ప్రపంచ క్షేమం లాంటి మాటల్నిఘనమైన వేదికల్లో గట్టిగా మాట్లాడుకోవటానికి పనికి వస్తుందే తప్పించి.. అసలు విషయానికి వచ్చేసరికి అవేమీ కనిపించదు. చూస్తూ.. ట్రంప్ లాంటి మొండి అధినేతతో పెట్టుకొని.. తన కిందకు నీళ్లు తెచ్చుకోవటం ఎందుకు? అన్న ఆలోచన చేస్తాడు. కొందరైతే.. అసలు తమకు సంబంధం లేనట్లే వ్యవహరిస్తారు. ఇదంతా చూస్తే.. తెలుగు సినిమాలోని సన్నివేశాలు ప్రపంచ రాజకీయాల్ని.. ట్రంప్ లాంటి దేశాధినేత మైండ్ సెట్ ను ప్రతిబింబించేలా చేస్తుంటాయి. సో.. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. దానికి చింతించాల్సిన అవసరం లేదు. అన్నింటికి మించి మన పూర్వీకులు చెప్పిన ఒక మాట అక్షర సత్యం.. అదే.. ‘‘బలవంతుడిదే రాజ్యం’’.

Tags:    

Similar News