ఎప్పుడూ అవే మాటలా ట్రంప్... కాస్తైనా ఏమీ అనిపించదా?

ఈ క్రమంలో తాజాగా థాయిలాండ్ - కంబోడియా దేశాల మధ్య మొదలైన ఘర్షణపై స్పందించారు.;

Update: 2025-07-27 06:51 GMT

ఎవరు ఎన్ని చెప్పినా.. ఎవరు ఎంత చెప్పినా.. వాస్తవం ఏమిటో తనకు పూర్తిగా తెలిసినా.. ట్రంప్ మాత్రం మారడం లేదు! తనకు అనిపించింది చెప్పుకుంటూ, చేసుకుంటూ పోతున్నారు! నవ్విపోదురు గాక నాకేటి అన్నట్లుగా ట్రంప్ వ్యవహారశైలి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి భారత్ – పాక్ మధ్య జరిగిన యుద్ధం గురించి ప్రస్థావించారు!

అవును... మొన్న భారత్ - పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని.. ఇటీవల ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం ఆగడానికి తానే కారణమని.. అయినప్పటికీ తనకు నోబె ల్ శాంతి బహుమతి రాదని చెప్పుకుంటున్న ట్రంప్.. శాంతి బహుమతి ప్రేమతో గెలిస్తే వస్తుంది తప్ప.. బెదిరించో, బలవంతం పెట్టో చేయిస్తే రాదనే విషయాన్ని మరిచిపోతున్నారనే మాటలకు అవకాశం ఇస్తున్నారు!

ఈ క్రమంలో తాజాగా థాయిలాండ్ - కంబోడియా దేశాల మధ్య మొదలైన ఘర్షణపై స్పందించారు. ఈ సమయంలో కాల్పుల విరమణ చర్చలకు తక్షణమే అంగీకరించారని ప్రకటించారు. తాను కంబోడియా ప్రధాని హున్‌ మానెట్‌, థాయ్‌ ప్రధాని పుమ్తోమ్‌ వెచియాచైతో మాట్లాడినట్లు చెప్పిన ట్రంప్.. వారు యుద్ధం కొనసాగిస్తే.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు దెబ్బతింటాయని హెచ్చరించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా... సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ట్రంప్... ఇరు వర్గాలు తక్షణమే కాల్పుల విరమణ.. శాంతి కోసం ఎదురు చూస్తున్నాయని రాశారు. ఇదే సమయంలో.. ఇరు దేశాలు అమెరికాతో వాణిజ్య చర్చలు జరపడానికి తొందరపడుతున్నాయని చెప్పారు. ఆ రెండు దేశాలకు సుదీర్ఘమైన సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం ఉందని చెప్పారు.

ఈ విధంగా... తాను కంబోడియా, థాయ్‌ ప్రధానులతో మాట్లాడానని.. వారు యుద్ధం కొనసాగిస్తే, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు దెబ్బతింటాయని హెచ్చరించినట్లు చెప్పిన ట్రంప్... దీన్ని చూస్తుంటే తాను విజయవంతంగా నిలిపివేసిన భారత్ - పాక్ యుద్ధమే గుర్తుకువస్తోందంటూ పాత పాటే పాడారు! దీంతో.. ట్రంప్ పై నెటిజన్లు మరోసారి విరుచుకుపడుతున్నారు.

కాగా.. భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణకు.. అమెరికాతో వాణిజ్యానికి.. ట్రంప్ పాత్రకు ఎలాంటి సంబంధం లేదని భారత్ ఇప్పటికే పలుమార్పు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. ప్రపంచ వేదికలపై ట్రంప్ ఈ తరహా ప్రకటనలు మాత్రం మానడం లేదు.

Tags:    

Similar News