మోడీని ఇరుకున పెడుతున్న ట్రంప్... స్టార్ట్ చేసిన కాంగ్రెస్!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ - పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నడిచిన సంగతి తెలిసిందే;
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ - పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నడిచిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారత్ సైన్యం పాక్ ని వణికించేస్తోందనే చర్చ నడించింది. ఈ దెబ్బతో పాక్ పని అయిపోయిందని అనుకుంటున్న వేళ.. సడన్ గా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరింది అంటూ ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు.
అనంతరం ఇటు భారత్ నుంచి, అటు పాకిస్థాన్ నుంచి అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. ఆ సంగతి అలా ఉంటే... ఈ సీజ్ ఫైర్ జరిగిందనే విషయం కంటే.. ఆ ప్రకటనను తొలుత ట్రంప్ చేశారనే విషయంపై తీవ్ర చర్చ నడించింది. మరోపక్క.. ట్రంప్ ఒత్తిడికి భారత్ ఎందుకు లోంగాల్సి వచ్చిందనే చర్చా నడిచింది. అయితే.. వాణిజ్యం పేరు చెప్పి ఒప్పించినట్లు ట్రంప్ చెప్పుకున్నారు.
అయితే ఆ విషయాన్ని భారత్ ఖండించింది. సీజ్ ఫైర్ చర్చల మధ్య వాణిజ్యం అనే ప్రస్థావనే రాలేదని చెప్పింది! అయితే.. ట్రంప్ మాత్రం ఈ విషయాన్ని వదలడం లేదు! భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని పదే పదే ప్రకటించుకుంటున్నారు. దీంతో... ప్రధాని మోడీపై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
అవును... భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకోవడంపై ప్రధాని మోడీని కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రశ్నించింది. ఇందులో భాగంగా... భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానంటూ ట్రంప్ పదే పదే ఈ విషయాన్ని ప్రస్థావిస్తున్నారని.. గత 21 రోజుల్లో ఇది 11వ సారి అని జైరాం రమేశ్ పోస్ట్ పెట్టారు.
రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణలు తగ్గించడానికి తాము జోక్యం చేసుకున్నామని.. వాణిజ్యాన్ని ఒక సాధనంగా వాడామని చెప్తున్నారని.. చివరికి కోర్టులోనూ ట్రంప్ ఇదే వాదన వినిపించారని.. కానీ దీనిపై ట్రంప్ స్నేహితుడు మోడీ మాత్రం పూర్తి మౌనం వహిస్తున్నారని చెబుతూ.. ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పోస్ట్ పెట్టారు.
కాగా... భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణకు తామే మధ్యవర్తిత్వం వహించామని.. ఉద్రిక్తతలకు ముగింపు పలికితేనే వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటామని చెప్పామని.. లేకపోతే ఎలాంటి వాణిజ్యం చేయబోమని స్పష్టం చేశామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే!