జూన్ 1 నుండి మళ్లీ 'టోలు'వలిచేస్తారు !

పెరిగిన టోల్ చార్జీలు జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

Update: 2024-05-22 14:45 GMT

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ చార్జీలు మళ్లీ పెరగనున్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరిగే టోల్ చార్జీల పెంపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. పెరిగిన టోల్ చార్జీలు జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద ఒకొక్కటి చొప్పున మూడు టోల్‌ప్లాజాలను జీఎమ్మార్‌ సంస్థ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 2012 నుంచి టోల్‌ఫీజు వసూళ్లను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది.

నేషనల్ హైవే అథారిటీ నిబంధనల మేరకు ప్రతిఏటా ఏప్రిల్ ఒకటో తేదీన టోల్‌ఫీజు ధరలను పెంచుకునే వెసులుబాటు జీఎమ్మార్‌ సంస్థకు ఎన్‌హెచ్‌ఏఐ కల్పించింది. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టోల్ చార్జీల పెంపును ఎన్నికల సంఘం వాయిదా వేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించింది.

దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా జూన్ 1న చివరి విడత ముగియనుంది. ఆ రోజు అర్ధరాత్రి నుంచి పెరిగిన టోల్ ధరలు అమల్లోకి వస్తాయి.

Read more!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న హైదరాబాద్‌-విజయవాడ (65), హైదరాబాద్‌-వరంగల్‌ (163) జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. విజయవాడ -జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌, ఏపీలోని చిల్లకల్లు(నందిగామ), వరంగల్‌ హైవేపై బీబీనగర్‌ మండలం గూడురు టోల్‌ప్లాజాలు ఉన్నాయి.

రోజుకు పంతంగి టోల్‌ప్లాజా మీదుగా సుమారు 30 వేలకు పైగా, గూడూరు టోల్‌ప్లాజా వద్ద 27వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తుంటాయి. టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్‌లకు రెండు వైపుల ప్రయాణానికి రూ.5, చిన్న లారీ, 10 టైర్స్ పై రూ.10 పెరిగాయి. వాణిజ్య, భారీ గూడ్స్ లారీలకు రూ.15 రూపాయలు పెరిగింది. మొత్తం ఐదు శాతం మేర టోల్ చార్జీలు పెరిగాయి. బెంగుళూరు, నాగపూరు, ముంబయి, కరీంనగర్ రహదారుల మీద కూడా ఇదే పెంపు వర్తిస్తుందని చెబుతున్నారు.

Tags:    

Similar News