కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం? సంచలన నిర్ణయం దిశగా మమతా బెనర్జీ

మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 60 మంది వేరు కుంపటి పెట్టుకోగా, 29 మంది ఎంపీల్లో 20 మంది బీజేపీకి మద్దతు ప్రకటించేలా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

Update: 2026-06-10 15:30 GMT

బెంగాల్ రాజకీయాలు ఊహించని మలుపు తీసుకుంటున్నాయా? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తోంది. రెండు రోజులుగా ఢిల్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గమనిస్తే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో అధికారం కోల్పోయిన మమత అధికార బీజేపీని ఢీకొట్టాలంటే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇండియా కూటమి సమావేశానికి వెళ్లిన మమత వరుసగా కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమవుతున్నారు. సోనియా, రాహుల్ తో బ్యాక్ టు బ్యాక్ భేటీ అవుతూ జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలను చర్చిస్తున్నారని అంటున్నారు.

పశ్చిమబెంగాల్ లో ఓటమి తర్వాత మమత నాయకత్వంపై పార్టీలో తిరుగుబాటు తీవ్రమవుతోంది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 60 మంది వేరు కుంపటి పెట్టుకోగా, 29 మంది ఎంపీల్లో 20 మంది బీజేపీకి మద్దతు ప్రకటించేలా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకోడానికి తన అస్థిత్వం దెబ్బతినకుండా చూసుకునేందుకు మమత మాస్టర్ ప్లాన్ రచించారని అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ని కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా తిరుగుబాటు నేతలకు షాక్ ఇవ్వాలని భావిస్తున్నారని అంటున్నారు. ఎంపీలు చేజారిపోతే పార్టీ జాతీయ హోదాకు, ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని మమత భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఫిరాయింపులకు చెక్ పెట్టడమే లక్ష్యం

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను తట్టుకుని, తన ఎంపీలను కాపాడుకోవాలంటే కాంగ్రెస్‌తో విలీనమే ఏకైక మార్గమని మమతా బెనర్జీ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. టీఎంసీ పూర్తిగా కాంగ్రెస్‌లో విలీనమైతే.. సాంకేతికంగా ఎంపీలంతా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలోకి వస్తారని అంటున్నారు. తద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి ఎంపీలను కాపాడుకోవచ్చునని చెబుతున్నారు. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఈ విలీనం కనుక జరిగితే మమతా బెనర్జీకి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్ష పదవి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చేలా సోనియా గాంధీ ఆఫర్ ఇచ్చినట్లు హస్తిన వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇటు సోనియాతో భేటీ.. అటు సీఐడీ రైడ్స్

ఢిల్లీలో 10 జనపథ్ నివాసంలో సోనియా గాంధీతో మమతా బెనర్జీ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న దశాబ్దాల అనుబంధం ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, సరిగ్గా ఇదే సమయంలో కోల్‌కతాలోని మమతా బెనర్జీ నివాసం, టీఎంసీ ప్రధాన కార్యాలయంపై పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారులు ఫోర్జరీ సంతకాల కేసు దర్యాప్తు పేరిట దాడులు చేయడం తీవ్ర ఉత్కంఠ రేపింది. అభిషేక్ బెనర్జీ సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల బుక్‌పై కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో ఈ హైడ్రామా నడుస్తోంది. ఈ పరిణామాలపై టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ స్పందిస్తూ.. ఇది కేంద్రం చేస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్య అని, సోనియాతో మమతా మీటింగ్ జరుగుతున్న సమయాన్నే చూసి సీఐడీని పంపించారని మండిపడ్డారు.

Tags:    

Similar News