భూమన అనర్హుడు...తిరుపతిని నుంచి వెళ్ళగొట్టాల్సిందే !

భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ కీలక నాయకుడు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.;

Update: 2025-08-26 20:30 GMT

భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ కీలక నాయకుడు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతే కాదు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రెండు సార్లు చేశారు. ఇక ఆయన తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీద విమర్శలు చేస్తున్నారు. టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. దీనిని కౌంటర్ అన్నట్లుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ భూమన కరుణాకరరెడ్డి మీద నిప్పులు చెరిగారు. అంతే కాదు ఆయనను ఏకంగా తిరుపతిలో నివసించేందుకే అనర్హుడు, వెళ్ళగొట్టాలని కూడా హాట్ కామెంట్స్ చేశారు.

అవాస్తవాలు అబద్ధాలు :

టీటీడీ చైర్మన్ గా తాను ఎంతో పవిత్రతతో నిష్టతో పాలనను చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తన మీద టీటీడీ మీద భూమన వంటి వారు ఇతర వైసీపీ నేతలు అవాస్తవాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. తాను బోర్డు బాధ్యతలు తీసుకున్నాక అవినీతికి ఎక్కడా ఆస్కారం లేకుండా పనిచేస్తున్నామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. అయితే తాము అవినీతికి అలవాటు పడిన తీరులోనే ఇపుడు అంతా జరుగుతోందని భావిస్తూ తమ మీద వైసీపీ నేతలు బురద జల్లుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు.

అసలు మ్యాటర్ ఇదే :

ముంతాజ్ హోటల్ వ్యవహారంలో తప్పు అంతా చేసింది వైసీపీ నేతలే అని బీఆర్ నాయుడు ఆరోపించారు. ఏడు కొండలను ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని ముంతాజ్ హొటల్ కి కేటాయించడం ద్వారా వైసీపీ నేతలు తన హయాంలో పెద్ద తప్పు చేశారు అని ఆయన ఎత్తి చూపించారు. పవిత్ర తిరుమల పరిసరాలలో ముంతాజ్ హొటల్ నిర్మాణం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆ యాజమాన్యాన్ని ఒప్పించి మరో చోటన 25 ఎకరాల భూములను తీసుకునేందుకు కూడా అంగీకరించేలా చూశారని అన్నారు. అయితే టీటీడీ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ అంశంలో సీబీఐ విచారణను జరిపించాలని వైసీపీ నేతలు అడగడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ నాయుడు ఎద్దేవా చేశారు.

బెదిరించించి వైసీపీ వాళ్ళే :

ఇక వైసీపీ నేతలు డబ్బును వెదజల్లి అందరినీ కొనేందుకు అలవాటు పడ్డారంటూ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ముంతాజ్ హొటల్ కి భూములు ఇచ్చేందుకు అజయ్ అన్న వ్యక్తిని సైతం బెదిరించారని ఆయన విమర్శిచారు. ఆయనను తుపాకీ చూపించి కూడా బెదిరించారని బీఆర్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. తాము ఎంతో పవిత్రంగా తిరుమల వ్యవహారాలను చూస్తూ నిబద్ధతతో పనిచేస్తూంటే తప్పుడు ఆరోపణలు చేస్తూ వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పూర్తి ఆక్షేపణీయం అని ఆయన అన్నారు

భూమన ఉండాల్సింది కాదు :

మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీద ప్రస్తుతం టీటీడీ చైర్మన్ అయిన బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉండాల్సింది తిరుపతిలో కానే కాదు అన్నారు. ఆయన తిరుపతిలో నివాసం ఉండేందుకు అనర్హుడు అని కూడా అన్నారు. ఆయనను తిరుపతి నుంచి తరిమి కొట్టాలని పిలుపు ఇచ్చారు. మొత్తం మీద టీటీడీ విషయంలో బీఆర్ నాయుడు వర్సెస్ భూమన గా సాగుతున్న ఈ వ్యవహారంతో రాజకీయంగానూ చర్చ రేగుతోంది. ఇక అల్టిమేట్ కౌంటర్ అన్నట్లుగా భూమన తిరుపతి నుంచే లేకుండా చూడాలని తరిమి కొట్టాలని బీఆర్ నాయుడు ఇచ్చిన పిలుపు వైరల్ అవుతోంది మరి దీని మీద భూమన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News