బరి తెగించిన జీఎస్టీ అధికారి.. ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా?

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేసిన తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్.సుభాష్ చంద్రబోస్ ను సస్పెండ్ చేశారు.;

Update: 2025-09-23 05:44 GMT

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేసిన తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్.సుభాష్ చంద్రబోస్ ను సస్పెండ్ చేశారు. గత నెలలో అమరావతి మునిగిపోయిందని పోస్టు చేయడమే కాకుండా, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వ్యంగ్య వ్యాఖ్యానాలు చేసిన ఏసీ సుభాష్ చంద్రబోస్ క్రమశిక్షణను అతిక్రమించారని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సోషల్ మీడియా పోస్టులపై ఆయన ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని భావించి విధుల నుంచి వేటు వేశారు. దీంతో రాజధాని విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ప్రభుత్వం గట్టి హెచ్చరికలు పంపినట్లైంది.

వాణిజ్య పన్నుల శాఖ (జీఎస్టీ)లో తిరుపతి ప్రాంతీయ ఆడిట్, ఎన్ఫోర్సుమెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ (ఎఫ్ఏసీ)గా పనిచేస్తున్న ఎస్.సుభాష్ చంద్రబోస్ ఆగస్టులో కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టారు. వైసీపీ నేతలు చేసిన ప్రచారాన్ని సమర్థిస్తూ రాజధాని అమరావతిపై వ్యంగ్య వ్యాఖాలు చేశాడు. సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

వైసీపీ అనుకూల మీడియాలో వచ్చిన ఫొటోలు, కథనాలను తన సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసిన జీఎస్టీ ఏసీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యాడు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయితే తన పోస్టులకు కట్టుబడి ఉన్నట్లు ఆయన తన సంజాయిషీలో పేర్కొనడంతో విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. గత నెల 18న ఆయన ఫేక్ ప్రచారం చేయగా, సుమారు నెల రోజుల పాటు విచారణ జరిపి, క్రమశిక్షణ ఉల్లంఘించినట్ల నిర్ధారించుకుని సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు అమరావతి పరిసరాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. తాడికొండ మండలంలో పంట పొలాల్లో కొంతమేర నీరు చేరిందని చెబుతున్నారు. అయితే ఏటా వర్షాకాలంలో ఈ పరిస్థితి ఉంటుందని, రెండు మూడు రోజులకే ఆ నీరు తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. అయితే రాజధానిగా అమరావతిని వ్యతిరేకిస్తున్న ఓ వర్గం నేతలు గత నెలలో కురిసిన వర్షాలకు రాజధాని మొత్తం మునిగిపోయిందని మీడియాలో ప్రచారం చేశారు. వేరే ప్రాంతానికి చెందిన ముంపు వీడియోలు, ఫొటోలను అమరావతిగా చూపుతూ ఫేక్ ప్రచారం చేశారని ప్రభుత్వం ఆరోపించింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారి అయిన సుభాష్ చంద్రబోస్ కూడా విపక్ష నేతలు మాదిరిగా తప్పుడు ప్రచారం చేయడాన్ని సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వంలో బాధ్యత గల వ్యక్తిగా ఉంటూనే సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి బాధ్యతారాహిత్యం ప్రదర్శించారని భావించింది. రాజధానిలో శాఖమూరు, క్రిష్ణాయపాలెం, నీరుకొండల్లో సీఆర్డీఏ రిజర్వాయర్లు నిర్మించనుందంటూ వచ్చిన ఒక వార్తను ట్యాగ్ చేస్తూ ‘అమరావతిలో మూడు రిజర్వాయర్లు ఎందుకు? అమరావతినే ఒక రిజర్వాయరుగా కడితే పోలా? అంటూ సుభాష్ చంద్రబోస్ పోస్టు చేశారని గుర్తించింది. అంతేకాకుండా ఏడాదికి మూడు పంటలు పండే నేల, రిజర్వాయర్ నీళ్లతో పుష్కలంగా ఉండదా? అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేయడాన్ని క్రమశిక్షణా రాహిత్యంగా నిర్ధారించుకుంది.

అంతేకాకుండా మరో పోస్టు ద్వారా ‘ఒకే ఒక్క వర్షం.. అమరావతి జలమయం’ అంటూ మరో కామెంట్ పెట్టినట్లు గుర్తించింది. అందులో ‘ఇదే మన డ్రోన్ క్యాపిటల్, ఇదే మన క్వాంటం వాలీ, వెనకబడిన ప్రాంత నిధులు, ప్రజల మీద నిర్మించిన నగరం, అతిపెద్ద రైల్వేస్టేషన్, అతిపెద్ద విమానాశ్రయం కట్టే రాజధాని’ అంటూ పోస్టు పెట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఆరు నెలల పాటు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది.

Tags:    

Similar News