తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ.. సుప్రీంకోర్టు చెప్పాల్సిందే!!

తాజాగా త‌మ నివేదిక‌ను సుప్రీంకోర్టుకు అందించింది. ``తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారానికి సంబంధించి విచార‌ణ దాదాపు పూర్త‌యింది.;

Update: 2025-06-28 03:34 GMT

ఏపీలో గ‌త ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు.. అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు.. తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ప్ర‌సాదం ల‌డ్డూలో వినియోగించే నెయ్యి క‌ల్తీ జ‌రిగింద‌ని.. జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వినియోగించార‌ని గ‌త ఏడాది సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా పెను వివాదంగా మారింది. ఒక్క ఏపీనే కాకుండా.. దేశం, ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా హిందువులు తీవ్ర ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప‌ర‌మ ప‌విత్ర‌మైన ల‌డ్డూ ప్ర‌సాదంలో పంది, దున్న కొవ్వులు క‌లిసాయ‌న్న వార్త‌.. ఒక‌ర‌కంగా ప్ర‌జ‌ల‌ను కుదిపేసింది.

ఈ వ్య‌వ‌హారం తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయాల‌ను కూడా ప్ర‌కంప‌న‌ల‌కు గురి చేసింది. ఈ క్ర‌మంలో వారంతా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్నినియ‌మించింది. దీనిలో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌ను స్వ‌యంగా ప్ర‌తిపాదించింది. ఈ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం.. దాదాపు 10 నెల‌లుగా విచార‌ణ సాగించింది. తిరుమ‌ల‌కు నెయ్యిని ర‌వాణా చేసిన ఏఆర్ డెయిరీ స‌హా.. బోలే బాబా డెయిరీలను కూడా కేసులో పేర్కొని ఆయా సంస్థ‌ల నిర్వాహ‌కులు ఉద్యోగుల‌పైనా విచార‌ణ చేసింది.

అదేవిధంగా వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డులో ప‌నిచేసిన‌వారు.. అప్ప‌ట్లో నెయ్యికోసం.. వేసిన ప్ర‌త్యేక క‌మిటీ స‌భ్యుల‌ను కూడా విచారించిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం.. ఇక‌, ఈ విచార‌ణ‌కు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా త‌మ నివేదిక‌ను సుప్రీంకోర్టుకు అందించింది. ``తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారానికి సంబంధించి విచార‌ణ దాదాపు పూర్త‌యింది. దీనికి సంబంధించిన అన్ని వివ‌రాల‌ను నివేదిక‌లో పేర్కొన్నాం. దీనికి సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించాం. సుప్రీంకోర్టు నిర్ణ‌యం తీసుకుంటుంది`` అని విచార‌ణ బృందానికి చెందిన ఓ అధికారి ఆఫ్ ది రికార్డుగా మీడియాకు వెల్ల‌డించారు. సో.. ఈ నివేదిక సుప్రీంకోర్టుకు చేరింది. మ‌రి తిరుమ‌ల ల‌డ్డూలో జంతువుల‌ కొవ్వు.. వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూడాలి.

Tags:    

Similar News