రాయుడు గారి మిలటరీ హోటల్లో ఆనందనిలయం సెట్టింగ్?
ఈ మిలటరీ హోటల్లో ఏర్పాటు చేసిన శ్రీవారి ఆలయ నమూనాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పలువురు.;
అదో మిలిటరీ హోటల్. అందులో శాఖాహారం మాత్రమే కాదు మాంసాహారాన్ని వడ్డిస్తారు. అయితే.. సదరు హోటల్లో శ్రీవారి గుడిని పోలి ఉండేలా సెట్టింగ్ ఏర్పాటు చేశారు. నాన్ వెజ్ వడ్డించే చోట ఈ గుడి సెట్టింగ్ ఏంది సామీ? అన్న ప్రశ్న తెర మీదకు వస్తే.. మా ఇంటి ఇలవేల్పు.. మా కుల దైవం.. ఆయన మీద భక్తితోనే మేం ఈ సెట్టింగ్ ను హోటల్లో వేయించామని సదరు మిలిటరీ హోటల్ యజమాని చెబుతున్నారు. ఇంతకూ ఇదెక్కడ ఏర్పాటు చేశారు? దీని యజమాని ఎవరు? తాజాగా ఈ వివాదంపై చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే..
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి సమీపంలో రాయుడు గారి మిలిటరీ హోటల్ ను ఏర్పాటు చేశారు. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ హోటల్ ఉండనుంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న జ్యోతుల నెహ్రూనే ఈ హోటల్ ను ప్రారంభించారు ఆయన టీటీడీ సభ్యుడు కూడా. వ్యాపార.. వాణిజ్య ప్రదేశంలో దేవుడి ఫోటోలు పెట్టుకోవటం తప్పేం కాదు. కానీ.. దేవుడి గుడి నమూనా మాదిరి.. ఏకంగా గుడి లాంటి సెట్టింగ్ వేయటంతోనే అసలు పంచాయితీ షురూ అయ్యింది.
ఈ మిలటరీ హోటల్లో ఏర్పాటు చేసిన శ్రీవారి ఆలయ నమూనాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పలువురు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి ఈ హోటల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా గుడిని పోలే సెట్టింగ్ వేయటం సరికాదని స్పష్టం చేశారు. మాంసాహారాన్ని వడ్డించి.. విందులు చేసుకునే హోటళ్లలో స్వామి వారి ఆలయ నమూనా సెట్టింగులు వేయటం సరికాదని తేల్చేవారు. వ్యాపార కేంద్రాల్లో స్వామి వారి ఫోటో ఫ్రేమ్ లు ఏర్పాటు చేయటం తప్పు కాదని.. ద్వారపాలకులతో కూడిన ఆలయాన్ని తలపించేలా సెట్ వేయటం సరికాదన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఏర్పాట్లను తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. ఈ రోజులు శ్రీవారి ఆలయాన్ని ఏర్పాటు చేసినోళ్లు.. రేపొద్దున విజయవాడ కనకదుర్గమ్మ.. శ్రీశైలం మల్లన్న.. అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయ నమూనాలు పెట్టే అవకాశం ఉందని.. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఏ ఎమ్మెల్యే చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారో.. అదే ఎమ్మెల్యే ఈ ఇష్యూను ఒక కొలిక్కి తేవాలన్న వ్యాఖ్య చేశారు. మరి.. దీనిపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.