చిన్నారులకు ఆన్ లైన్ వేధింపులు.. అమెరికాలో తెలుగోడు అరెస్టు

నీచ నికృష్టమైన నేరానికి పాల్పడ్డాడో తెలుగోడు. అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఆన్ లైన్ లో చిన్నారులను వేధిస్తున్న ఆరోపణలపై అరెస్టు అయ్యాడు.;

Update: 2026-03-20 04:37 GMT

నీచ నికృష్టమైన నేరానికి పాల్పడ్డాడో తెలుగోడు. అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఆన్ లైన్ లో చిన్నారులను వేధిస్తున్న ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. న్యూమెక్సికోలోని శాంటా ఫే పోలీసులు జరిపిన సీక్రెట్ ఆపరేషన్ లో ఇతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను లైంగికంగా ప్రలోభపెడుతున్న వైనాన్ని గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. ఈ తరహా నేరానికి పాల్పడిన మరో ముగ్గురు అమెరికన్లను సైతం పోలీసులు అరెస్టు చేశారు.

శాంటా ఫే పోలీసులు అరెస్టు చేసిన తెలుగు వ్యక్తిని నాగరాజు బల్కంగా పేర్కొంటున్నాడు. ఇతడి వయసు26 ఏళ్లు. ఇతనో ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్నట్లు చెబుతున్నా.. ఇతడికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు.. ఇతను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికి చెందిన వాడన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే.. చిన్నారుల వేధింపుల నేరానికి సంబంధించిన ఇతడ్ని అమెరికా పోలీసులు ఈ నెల 4 (మార్చి 4) అరెస్టు చేశారు. అదే రోజున పోలీసుల అరెస్టు వివరాల్ని వెల్లడించారు. ముగ్గురు అమెరికన్లతో పాటు తెలుగు వ్యక్తి ఉండటం.. దీనికి పెద్ద ప్రచారం రాలేదు. అరెస్టు ప్రకటన తర్వాత నిందితులకు సంబంధించిన మరే వివరాల్ని శాంటా ఫే పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు.

అయితే.. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు అనూహ్యంగా రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ కావటం.. తెలుగు వ్యక్తి అరెస్టు అయ్యారన్న వివరాలు తెలుగు కమ్యునిటిలోనూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఈ వివరాలు ప్రధాన వార్తగా మారింది. అదెలా జరిగిందంటే..నాగరాజు ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తుంటాడని.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాడన్న వివరాలతో ఈ వివరాలు వైరల్ గా మారాయి. ఇతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటునన వీడియో ఫుటేజ్ బయటకు రావటంతో ఇదంతా జరిగింది.

ఇంతకూ ఇదెంత తీవ్రమైన నేరమన్నది చూస్తే.. ఇలాంటి కేసుల్లో నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడే వీలుంది. అందునా పోలీసులు జరిపిన ఒక రహస్య ఆపరేషన్ లో వీరి దుర్మార్గాలు బయటపడ్డాయి. మూడు రోజుల ప్రత్యేక ఆపరేషన్ ను పోలీసులు నిర్వహించారు. ఆన్ లైన్ చైల్డ్ ప్రిడేటర్ పేరుతో ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో అండర్ కవర్ డిటెక్టివ్ లు తమను తాము మైనర్ల వలె నటిస్తూ వివిధ వెబ్ సైట్లు.. యాప్ ల ద్వారా నిందితులతో చాట్ చేసి వల విసురుతారు. వీరి వ్యూహం తెలీక.. తమకున్న నీచ మైండ్ సెట్ తో తప్పుడు పనులకు పాల్పడి.. అడ్డంగా బుక్ అవుతుంటారు.

నాగరాజుతో పాటు అరెస్టు అయిన ముగ్గురు అమెరికన్ల విషయానికి వస్తే వారు ఎడ్యురార్డో రామిరెజ్, హెరాల్డ్ ఆడమ్స్, టోమస్ కాక్జో. ఈ నలుగురికి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. వీరిలో నాగరాజు పిన్న వయస్కుడు. ఎడ్యురార్డో రామిరెజ్ 59 ఏళ్ల వయస్కుడు కాగా.. హెరాల్డ్ ఆడమ్స్ 55 ఏళ్లు. టోమస్ కాక్జో 29 ఏళ్లు. ఈ నలుగురికి సంబంధించి చిన్నారుల లైంగిక దోపిడీ ఆరోపణలు మాత్రమే కాదు.. పోలీసుల్ని ఎదిరించిన కేసులు కూడా నమోదు కావటం గమనార్హం.

తెలుగోడిగా చెబుతున్న నాగరాజు బల్కంపై రెండు రకాల తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకటి వ్యభిచారం, ఇతర లైంగిక చర్యల కోసం చిన్నారుల్ని వాడుకోవటం అయితే.. మైనర్లతో లైంగిక సంబంధాన్ని కోరుతూ డిజిటల్ పరికరాల ద్వారా సంప్రదించటం. అమెరికాలో ఈ తరహా నేరాల్ని అత్యంత తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. నాగరాజుపై ఉన్న ఆరోపణలు నిజమని తేలితే ఐదేళ్ల వరకు జైలుశిక్ష, పది వేల డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. ఈ తరహా నేరాల్లో శిక్ష పడితే నిందితులు జీవితాంతం సెక్స్ అఫెండర్ గా ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతారు. దీంతో వారికి ఫ్యూచర్ లో ఎలాంటి ఉద్యోగాన్ని పొందలేరు. చివరకు ఇల్లు అద్దెకు తీసుకోవటం కూడా చాలా కష్టమవుతుంది. నాగరాజు బారత పౌరుడు కావటంతో ఇతడి వీసాను రద్దు చేస్తారు. నేరం రుజువైతే అతనికి జైలు శిక్ష పూర్తైన తర్వాత నేరుగా భారతదేశానికి బహిష్కరించే వీలుంది. మళ్లీ అమెరికాలో అడుగు పెట్టకుండా శాశ్విత బ్యాన్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News