వైరల్ ఇష్యూ.. జాతీయ ఆరోగ్య బీమా పథకంలోకి బట్టతల సమస్య!
అవును... అందమైన అందాల ప్రమాణాలకు పేరుగాంచిన దక్షిణ కొరియాలో ఇప్పుడు బట్టతల అనేది ఓ జాతీయ సమస్యగా మారిన పరిస్థితి నెలకొందని అంటున్నారు.;
ఓ తెలుగు సినిమాలో హాస్యసన్నివేశం... బ్రహ్మానందం ఫుల్ ఉంగరాల జుట్టుతో పెళ్లి చూపులకు వెళ్తారు.. ఆ అమ్మాయికి తెగ నచ్చేస్తారు.. అయితే, కొన్ని కారణాల వల్ల పెళ్లి ఓ ఆరు నెలలు పోస్ట్ పోన్ చేస్తారు.. ఈ గ్యాప్ లో బ్రహ్మానందానికి జుట్టు మొత్తం ఊడిపోతుంది. అయితే పెళ్లిని ఏదోలా మేనేజ్ చేసేస్తారు. తీరా ఫస్ట్ నైట్ భార్య గదిలోకి పాలు తీసుకెళ్లగానే.. దూరాన్న కనిపించాల్సిన చందమామ, అడుగుల దూరంలో మెరుస్తుంటుంది.
దీంతో ఒక్కసారిగా ఆ కొత్త పెళ్లి కూతురు షాక్ తింటుంది. వెంటనే దగ్గరకు వచ్చిన బ్రహ్మానందం.. ‘ఏమైంది భాగ్యం’ అని అడుగుతారు. దానికి ఆమె సమాధానంగా.. ‘మీరు నాకు భర్తగా వద్దు’ అని అంటుంది. ఏ భర్తా తన తొలిరాత్రి వినకూడని మాట అది! ‘ఎందుకు’? అని అమాయకంగా అడుగుతారు బ్రహ్మానందం. అందుకు ఆమె... ‘నేను మిమ్మల్ని ఇష్టపడిందే ఆ రింగు రింగుల జుట్టు చూసి’ అని నిట్టూరిస్తూ అంటుంది.
అప్పుడు ఆందోళన, ఆవేదన కలగలిపిన గొంతుతో స్పందించిన బ్రహ్మానందం... ‘బొచ్చు శాస్వతం అనుకుని భ్రమపడుతున్నావా భాగ్యం?’ అని అంటారు! ‘మీరు ఎన్నైనా చెప్పండి’ అని ఆమె అంటుంది! ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకంటే... జుట్టు విలువ అది ఉన్నవారికి వారికి తెలియకపోవచ్చు కానీ.. దువ్వెన అవసరం లేనివారిని అడిగితే తెలుస్తుంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో ఈ సమస్య ఉన్నవారు పుష్కలంగా ఉన్నారు. ఇప్పుడు అదే సమస్య!
అవును... అందమైన అందాల ప్రమాణాలకు పేరుగాంచిన దక్షిణ కొరియాలో ఇప్పుడు బట్టతల అనేది ఓ జాతీయ సమస్యగా మారిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. గత ఏడాది దేశంలో జుట్టు రాలడం ద్వారా ఆసుపత్రులను సందర్శించిన 2,40,000 మందే అందుకు సాక్ష్యం. పైగా అందులో సుమారు 40% మంది 20 నుంచి 30 ఏళ్ల లోపు వారేకావడం గమనార్హం. దీంతో ఈ విషయంపై అధ్యక్షుడు కల్పించుకుని, స్పందించిన పరిస్థితి.
ఇందులో భాగంగా... ఈవారం జరిగిన ఓ సమావేశంలో స్పందించిన అధ్యక్షుడు లీ జే మ్యుంగ్.. అధికారులకు ఓ కీలక సూచన చేశారు. ఇందులో భాగంగా.. జుట్టు రాలడానికి వైద్య చికిత్సలను ఒకప్పుడు కాస్మొటిక్ గా చూసేవారు కానీ.. ఇప్పుడు అది మనుగడకు సంబంధించిన విషయంగా చూస్తున్నారని వాదించారు. ఈ నేపథ్యంలోనే దక్షిణకొరియా జాతీయ ఆరోగ్య బీమా జుట్టు రాలడానికి చికిత్సలను కవర్ చేయాలని అన్నారు.
దీనిపై స్పందించిన ఆరోగ్య మంత్రి జియోగ్ యున్ క్యోంగ్.. ప్రస్తుతం వైద్య పరిస్థితుల వల్ల కలిగే జుట్టు రాలడానికి చికిత్సలను జాతీయ ఆరోగ్య బీమా కవర్ చేస్తుంది కానీ.. వంశపారపర్యంగా జుట్టు రాలడం ఉన్న వ్యక్తులను ఇది మినహాయించిందని.. ఎందుకంటే అది ఎవరి ప్రాణాలకూ ముప్పు కలిగించదని తెలిపారు. దీనిపైనా స్పందిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రెసిడెంట్.
ఇందులో భాగంగా... వంశపారంపర్య సమస్యను ఒక వ్యాధిగా నిర్వచించాలా వద్ద ఆనేది మాత్రమే విషయమా అని అడిగారు. ఇదే సమయంలో.. జుట్టు రాలడాన్ని తగ్గించే సబ్సిడీ మందులకు తాను కృతజ్ఞుడిని అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియా వినియోగదారుల నుంచి ప్రశంసలు తెచ్చి పెట్టింది. ఈయన బెస్ట్ ప్రెసిడెంట్ అంటూ యువత కామెంట్లు పెడుతున్నారు!