కన్నీళ్లు.. హెచ్చరికలు.. కాంగ్రెస్ లో కాక

తెలంగాణ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ కష్టపడుతోంది. అధికార బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంది.;

Update: 2023-10-29 10:33 GMT

తెలంగాణ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ కష్టపడుతోంది. అధికార బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంది. గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయిస్తూ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సై అంటోంది. కానీ పార్టీలో అసంత్రుప్తి మాత్రం కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీపై, నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటూ పార్టీని వీడుతున్నారు. టికెట్లు దక్కలేదని ఆందోళనకు దిగుతున్నారు. కొందరేమో రెబల్స్ గా పోటీ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

తాజాగా 45 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితాను ప్రకటించింది. టికెట్ కోసం ఎదురు చూసిన నాయకులు ఈ జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో తీవ్రమైన అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. జూబ్లిహిల్స్ టికెట్ ఆశించిన పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాఫ్ టికెట్ గాళ్లకు టికెట్లు ఇస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లి దండాలు పెడితే సీట్లు ఇస్తారా అంటూ టికెట్ దక్కిన అజహరుద్దీన్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించి భంగపడ్డ రాఘవరెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ పై ఆరోపణలు చేశారు. మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దక్కడంతో చలమల్ల క్రిష్ణారెడ్డి రెబెల్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. జడ్చర్లలో రెబెల్ గా బరిలో దిగుతానని మొదట ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ బీఆర్ఎస్ లో చేరిపోయారు.

మరోవైపు ఎల్లారెడ్డి టికెట్ మదన్ మోహన్ కు ఇవ్వడంతో అక్కడ నియోజకవర్గ ఇంఛార్జీగా ఉన్న సుభాష్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. పీసీసీ మైనార్టీ విభాగం ఛైర్మన్ షేక్ అబ్దుల్లా సొహైల్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇలా కాంగ్రెస్ లో టికెట్ల గొడవ సాగుతూనే ఉంది. అసంత్రుప్తలను బుజ్జగించేందుకు ఓ వైపు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదని టాక్.

Tags:    

Similar News