అయ్యో బీజేపీ.. టికెట్లిస్తామన్నా నేతలు ఉండరా?

తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.;

Update: 2023-10-30 01:30 GMT

తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి పార్టీల్లో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ ఉంది. టికెట్లు దక్కని నాయకులు అసంత్రుప్తితో పార్టీని వీడుతున్నారు. బీజేపీ నుంచి కూడా నాయకులు బయటకు వెళ్తున్నారు. కానీ టికెట్లు దక్కలేదని కాదు టికెట్లు వచ్చినా గెలవలేమనే కారణంతో అనే చెప్పాలి. ఇప్పుడు బీజేపీలో టికెట్లు దక్కే నాయకులు కూడా పార్టీలో ఉండే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ తగ్గిపోవడం అదే సమయంలో కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుండటమే అందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ కు అసలైన పోటీ కాంగ్రెస్ అని భావిస్తున్న బీజేపీ నాయకులు గోడ దూకుతున్నారనే చెప్పాలి.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే 52 మందితో తొలి అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర రెడ్డి, వివేక్ లాంటి నాయకుల పేర్లు లేవు. వీళ్లను కచ్చితంగా బరిలో దింపాలని బీజేపీ ఇప్పటికీ అనుకుంటోంది. వీళ్లకు గెలుపు అవకాశాలు ఉన్నాయని పార్టీ నమ్ముతోంది. కానీ వీళ్లకు పార్టీపై మాత్రం లేకుండా పోయింది. బీజేపీ తరపున మునుగోడు టికెట్ ఇస్తామని చెప్పాని వినని రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. మరోవైపు చెన్నూరు టికెట్ ను వివేక్ ఇద్దామని బీజేపీ అనుకుంటోంది. కానీ ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది.

ఇక సీనియర్ నటుడు బాబు మోహన్ కు కూడా బీజేపీ టికెట్ ఇవ్వాలని చూస్తోంది. కానీ తొలి జాబితాలో తన పేరు లేదని, తనకు తన కొడుక్కి మధ్య గొడవ పెడుతున్నారని బాబు మోహన్ ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కూడా ప్రకటించారు. మాజీ, తాజా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తాను ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని, ఢిల్లీ నేతలు కూడా పట్టించుకోవడం లేదని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేసే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని కూడా బాబు మోహన్ చెప్పారు. మరి బీజేపీ తుది జాబితా ప్రకటించలోపే ఇంకెంతమంది పార్టీ మారతారో? ఒకవేళ టికెట్లు ఇచ్చిన వాళ్లు అందరూ పార్టీలోని ఉంటారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News