రేవంత్ తో కొట్లాడాలంటే ఆ ఇమేజ్ కోసం కేటీఆర్ !

ఆయన టీడీపీలో ఉన్నపుడు కల్వకుంట్ల చంద్రశేఖరావుగానే పరిచయస్తులు. ఆయన చంద్రబాబు కేబినెట్ లో రవాణా మంత్రిగా కూడా పనిచేశారు;

Update: 2025-04-22 01:30 GMT

తెలంగాణా రాజకీయాల్లో చూస్తే పక్కా మాస్ ఇమేజ్ ఉన్న వారు కేసీఆర్. ఆయన టీడీపీలో ఉన్నపుడు కల్వకుంట్ల చంద్రశేఖరావుగానే పరిచయస్తులు. ఆయన చంద్రబాబు కేబినెట్ లో రవాణా మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన 2000లో టీడీపీకి రాజీనామా చేసి 2001లో తెలంగాణా రాష్ట్ర సమితిని ప్రారంభించేంతవరకూ ఆ పేరుతోనే ఉండేవారు. ఆ తర్వాత సీన్ మొత్తం ఒక్కసారి మారిపోయింది. కేసీఆర్ గా ఆయనకు కొత్త నామకరణం జరిగింది. అంతే కాదు ఆయనలో మాస్ లీడర్ కూడా అపుడే బయటకు వచ్చారు.

అలా ఒక వైపు రాజకీయాన్ని మరో వైపు తెలంగాణా ఉద్యమాన్ని మిక్స్ చేస్తూ కేసీఆర్ పద్నాలుగేళ్ల పాటు సాగించిన పోరాటం ఆయనలో వీర లెవెల్ మాస్ లీడర్ ని బయటకు తెచ్చింది. కేసీఆర్ అలా తన మాటలతో ఆవేశంతో తెలంగాణా సమాజాన్ని ఊపేశారు. అయితే ఆయన తర్వాత ఆ తరహా మాస్ ఇమేజ్ ఉన్నది మాత్రం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికే.

ఆయన స్పీచ్ కూడా ఆకట్టుకుంటుంది. ఆయన చేసే విమర్శలు వేసే సెటైర్లు అందరినీ ఉర్రూతలూగిస్తాయి. అందుకే ఆయన కూడా మాస్ పల్స్ తెలిసి అందరినీ గెలిచి సీఎం అయ్యారు. ఇక బీఆర్ఎస్ లో కేసీఆర్ తరువాత మాస్ లీడర్ ఎవరు అంటే హరీష్ రావు పేరే చెప్పాలి. ఆయన కూడా అచ్చం తన మేనమామ తరహాలో స్పీచ్ ఇవ్వగలరు. మాస్ ని ఎట్రాక్ట్ చేయగలరు.

ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి క్లాస్ లీడర్ గా పేరుంది. ఆయన అమెరికాలో చదువుకుని అక్కడే జాబ్ చేసి తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన గతంతో పోలిస్తే తనలోని క్లాస్ టచ్ కి మాస్ ని జత చేస్తున్నారు. ఇక విపక్షంలోకి వచ్చాక గత ఏణ్ణర్థం కాలంలో కేటీఆర్ పక్కా మాస్ లీడర్ అవతార్ కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు.

అయితే తెలంగాణా యాస పల్లె పదాలు, సామెతలు పడికట్టు పదాలు అవన్నీ కేసీఆర్ కి పట్టుబడినంతగా కేటీఅర్ కి కుదరడం లేదని అంటున్నారు. అయినా సరే ఆయన తన స్టైల్ ని మార్చుకునేందుకు చూస్తున్నారు. తెలంగాణా సమాజంలో మాస్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయితేనే సీఎం పీఠం దక్కుతుదని ఒక లెక్క ఉంది.

దానికి ఉదాహరణగా కేసీఆర్ రేవంత్ రెడ్డి కనిపిస్తారు. దాంతో కేటీఅర్ ఆ రూట్ లో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కోసారి తన భాషలో కొంత దూకుడు ప్రదర్శిస్తూ రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు దాంతో అవి బూమరాంగ్ అవుతున్నాయన్న చర్చ ఉంది.

ఏది ఏమైనా ఎక్కడైనా మాస్ పల్స్ పట్టుకుంటేనే పీఠాలు కొట్టగలరు. అలాగని ఊర మాస్ ని కూడా జనాలు ఇష్టపడరు. ఆ పరిధిలూ పరిమితులూ చాలా ఉన్నాయి. ఏపీలో అయితే జగన్ మాస్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ఆయన భాషలో మాస్ అంత ఎక్కువగా ఉండదు, ఇక చంద్రబాబు కూడా మాస్ తో కనెక్ట్ అవుతున్నారు. కానీ దానికి తనదైన మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. సో మాస్ అవతార్ ప్రజలతో సంబంధం ఉన్న సినీ రాజకీయ రంగాలకు ఎంతో అవసరం. అయితే మోతాదు మించితే మాత్రం అవే ఇబ్బందికరం అవుతాయని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News