పవన్ సభకు అనుమతి లేదంటూ పోలీస్ శాఖ చెప్పింది ఇదే !

జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ లోని గచ్చి బౌలి వద్ద ఉన్న సంధ్య కన్వెన్షన్ హాలులో ఈ నెల 2న నిర్వహించతలపెట్టిన సాధక్స్ మీటింగ్ కి అనుమతి లేదని తెలంగాణా పోలీసులు స్పష్టం చేశారు.

Update: 2026-06-01 18:14 GMT

జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ లోని గచ్చి బౌలి వద్ద ఉన్న సంధ్య కన్వెన్షన్ హాలులో ఈ నెల 2న నిర్వహించతలపెట్టిన సాధక్స్ మీటింగ్ కి అనుమతి లేదని తెలంగాణా పోలీసులు స్పష్టం చేశారు. దానికి వారు చెప్పిన కారణాలను జనసేన అయితే సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తప్పు పడుతూ పోస్టు పెట్టింది. అయితే పోలీస్ శాఖ ఎందుకు అనుమతి నిరాకరించింది అన్నది చూస్తే కొన్ని ఆసక్తికరమైన కారణాలే చెబుతున్నారు.

ప్రొఫెసర్ వర్సెస్ జనసేన :

ఇటీవల కాలంలో తెలంగాణాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఏపీలో కేసులు పెట్టడం దాని మీద తెలంగాణాలో ప్రజల మనోభావాలు దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. అంతే కాదు ఏపీ నేతలు కొంతమంది చేసిన వ్యాఖ్యలు కూడా వేడిని రగిల్చాయని చెబుతున్నారు. దాంతో ఇలాంటి వాటి వల్ల వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఒక సభను కనుక జనసేన నిర్వహిస్తే కనుక ఉద్రిక్తతలు పెరిగి పెద్దవి అవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా జరిగి లా అండ్ ఆర్డర్ దెబ్బ తినే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

పార్కింగ్ సదుపాయం కూడా :

ఇక హైదరాబాద్ లోని శేర్ లింగం పరిధిలోకి వచ్చే గచ్చీబౌలి సంధ్యా కన్వెన్షన్ హాలులో పార్కింగ్ సదుపాయం కూడా ఇబ్బంది కరం అని పోలీసులు అంటున్నారు. అందుకే అక్కడ సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ సమావేశాన్ని ఏకంగా రెండు వేల మందితో నిర్వహిస్తామని చెబుతున్నారని ఆ మేరకు జనసేన జనసేన ప్రధాన కార్యదర్శి తమను కలిసి సభకు అనుమతి కోరారని పోలీసులు తెలిపారు. అల సభకు వచ్చే రెండు వేల మంది వల్ల పార్కింగ్ సమస్యలు ఉత్పన్నం అవుతాయని పోలేసులు చెబుతున్నారు. ఇక జనసేన పార్కింగ్ ప్లేస్ కోసం ఎఫ్‌సీఐకి చెందిన భూమిని ఉపయోగించుకోవాలని భావించినా, ఆ భూమిపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. అందుకే లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది లేకుండా అలాగే పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా జనసేన సభకు అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

గతంలో జరిగాయి :

దీనికి జనసేన సోషల్ మీడియా ద్వారా బదులిస్తూ గతంలో రెండు వేల మంది కంటే ఎక్కువగానే జనంతో సంధ్యా కన్వెన్షన్ హాలులో మీటింగ్ జరిగిందని చెప్పారు. ఇక లా అండ్ ఆర్డర్ విషయం చూస్తే తమ వైపు నుంచి ఎలాంటి వ్యాఖ్యలు లేవని కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణా అభివృద్ధిని కోరుకుంటు వచ్చారని కొండగట్టు అంజన్న ఆలయానికి ఆయన విరాళం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా జనసేన పుట్టిన గడ్డ తెలంగాణా అని అక్కడ సభను జరుపుకోవడంలో తప్పు లేదని ఆ పార్టీ అంటోంది. తమ సభను తిరస్కరించడానికి గల కారణాలు అయితే సబబుగా లేవని చెబుతోంది.

Tags:    

Similar News