సార్వత్రికాన్ని తలపిస్తున్న పంచాయతీల్లో ప్రచారం..!
మొత్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్న ఈ పంచాయతీ పోరులో ఎక్కడికక్కడ పార్టీల సహకారం కూడా అభ్యర్థులకు అందుతోంది.;
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజులు మాత్రమే గడవు ఉంది. ఈ నెల 11న తొలిదశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దీంతో 10వ తేదీని డ్రైడేగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో 8, 9 తేదీలు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉన్నాయి. దీనిని సాధ్యమైనంత వరకు వినియోగించుకునే దిశగా అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తొలిదశలో 120 వరకు పంచాయతీల్లో ఏకగ్రీవం ప్రక టించిన విషయం తెలిసిందే.
దీంతో అవి మినహా మిగిలిన పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీనిలో చిత్రం ఏంటంటే.. పంచాయతీ ఎన్నికల ప్రచారం సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని మించిసాగుతుండడమే. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఏ విధంగా హామీలు ఇస్తారో.. ఇప్పుడు కూడా అలాంటి హామీలే వినిపిస్తున్నాయి. ఇక, ఓటర్లను మచ్చిక చేసుకునేం దుకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎలా అయితే .. ప్రయత్నిస్తారో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంది.
మొత్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్న ఈ పంచాయతీ పోరులో ఎక్కడికక్కడ పార్టీల సహకారం కూడా అభ్యర్థులకు అందుతోంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలకు పార్టీలకు సంబంధం ఉండదు. అయినప్పటికీ.. తమ తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ కూడా కీలకంగా భావిస్తున్నాయి. దీంతో సార్వత్రిక ఎన్నికలను మించిన విధంగా ప్రచారం జరుగుతుండడం గమనార్హం.
ఎవరికి వారే కీలకం!
సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో సామాజిక వర్గాలు ఎలా అయితే.. ప్రభావం చూపుతాయో.. ఇప్పుడు పంచాయతీల్లోనూ అలాంటి ప్రభావం చూపిస్తోంది. దీంతో ఎవరికి వారే కీలకంగా మారుతున్నారు. దీనికితోడు సమీప బంధువులు.. కూడా ఎంట్రీ ఇచ్చారు. కులాలు, గోత్రాలు, మతాలు.. ఇలా అనేక రకాలుగా పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైన ప్రభావం కనిపిస్తుండడం గమనార్హం.