ఆ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే..తేల్చిన తెలంగాణ స్పీకర్..తర్వాత?
ఒక పార్టీ తరఫున గెలిచి.. మరో పార్టీలోకి ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో మరో కీలక పరిణామం.;
ఒక పార్టీ తరఫున గెలిచి.. మరో పార్టీలోకి ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో మరో కీలక పరిణామం. రాష్ట్రంలో రెండేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ వైపు మొగ్గుచూపారు. అయితే, వీరిపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. ఈ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానంలో శుక్రవారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ ఆదివారం తీర్పు వెల్లడించారు. 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచారు దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్ పూర్), కాలే యాదయ్య (చేవెళ్ల), పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్స్ వాడ), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), సంజయ్ (జగిత్యాల), క్రిష్ణమోహన్ రెడ్డి (గద్వాల), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి). అయితే, అనంతర పరిణామాల్లో వీరు అధికార కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది.
మిగిలింది ఇద్దరే...
గతంలో జరిపిన విచారణలో స్పీకర్ ప్రసాద్ కుమార్... ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆదివారం నాటి విచారణలో మరో ఇద్దరు... ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్యల విషయంలోనూ ఇదే తీర్పు వెల్లడించారు. వీరు బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చారు. ఇక మిగిలింది దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ లపై విచారణే. అయితే, సంజయ్ పై దాఖలైన అనర్హత పిటిషన్ పై ఇప్పటికే విచారణ ముగిసింది. తీర్పు రిజర్వులో ఉంది. దానం, కడియంల పిటిసన్లపైనే విచారణ జరపాల్సి ఉంది. మొత్తమ్మీద ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణకు ఒకరోజు ముందు తెలంగాణలో కీలక పరిణామం జరిగింది.
యాదయ్యపై చింతా.. పోచారంపై జగదీశ్‌రెడ్డి
పార్టీ ఫిరాయించినట్లుగా కాలే యాదయ్యపై సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పోచారంపై సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పీకర్ ట్రైబ్యునల్ లో గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఆదివారం తీర్పు చెప్పారు. గతంలోనే ఐదుగురు ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకటరావు, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డిలపై ఫిరాయింపు ఆరోపణల పిటిషన్లను స్పీకర్ కొట్టివేవాశారు.