స్థానిక సంస్థల హంగ్ లెక్కలు మామూలుగా లేవుగా?
మున్సిపల్ ఎన్నికల్లో అధిక్యత అధికార కాంగ్రెస్ పార్టీకి లభించినా.. ఇప్పుడో విచిత్రమైన పరిస్థితిని అధికార పార్టీతో పాటు మిగిలిన రాజకీయ పార్టీలు ఎదుర్కొంటున్నాయి.;
మున్సిపల్ ఎన్నికల్లో అధిక్యత అధికార కాంగ్రెస్ పార్టీకి లభించినా.. ఇప్పుడో విచిత్రమైన పరిస్థితిని అధికార పార్టీతో పాటు మిగిలిన రాజకీయ పార్టీలు ఎదుర్కొంటున్నాయి. మొత్తం 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు రావటంతో పాలక మండళ్ల ఏర్పాటు అంశం మూడు ముక్కలాటగా మారింది. నిత్యం కత్తులు దూసుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎవరో ఒకరితో సహకరించుకుంటే దాదాపు 15 మున్సిపాలిటీల్లో పాలకమండళ్లు కొలువు తీరే పరిస్థితి నెలకొనటం ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో ఎవరు ఎవరితో ఎక్కడెక్కడ కలుస్తారన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ఒకవేళ అలాంటి పరిస్థితే లేకపోతే మరో మార్గమేంటి? అన్న ప్రశ్నకు సమాధానం రెఢీగా ఉంది. అదే.. గోడదూకుళ్లను ప్రోత్సహించటం మినహా మరో మార్గం లేని పరిస్థితి. తాజాగా హంగ్ ఫలితాలు వచ్చిన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే 15 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ మద్దతు తప్పనిసరి. లేదంటే.. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లను తమ పార్టీలోకి వచ్చేలా చేయటం కానీ చేయాలి. అలాంటి పరిస్థితి నెలకొన్న మున్సిపాలిటీలను చూస్తే..
మెట్ పల్లి
రాయికల్
అలంపూర్
కామారెడ్డి
జమ్మికుంట
కాగజ్ నగర్
మెదక్
నర్సాపూర్
ఎల్లంపేట
ఖానాపూర్
ఇంద్రేశం
జిన్న
అమరచింత
వర్ధన్నపేట
కేతనపల్లి
ఈ పదిహేను మున్సిపాలిటీల్లో కొన్నింటిలో అధికారాన్ని పంచుకునేలా బీఆర్ఎస్, బీజేపీలు నిర్ణయానికి వస్తే అధికారం ఆ రెండు పార్టీల చేతికి వచ్చేస్తుంది. ఇందుకు ఛైర్మన్ పదవిని ఒక పార్టీ.. వైస్ ఛైర్మన్ పదవిని మరో పార్టీ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. బీఆర్ఎస్ తో దోస్తీకి బీజేపీ సిద్ధంగా ఉందా? అన్నది ప్రశ్న. ఆ పార్టీని నమ్మకమైన మిత్రుడిగా చూసేందుకు కమలనాథులు సిద్ధంగా లేరన్న మాట వినిపిస్తోంది. మరోవైపు నిత్యం కత్తులు దూసుకునే పార్టీలు.. ఇప్పుడు రెండో పార్టీతో అధికారాన్నిషేర్ చేసుకుంటే జరిగే పొలిటికల్ డ్యామేజ్ మీద లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి. అందుకే.. తమ ప్రత్యర్థి పార్టీతో అధికారాన్ని షేర్ చేసుకునే విషయంలో దూకుడు ప్రదర్శించటం లేదంటున్నారు.
రాజకీయంగా ఏ రెండు పార్టీలు కలిసినా.. మూడో పార్టీకి రాజకీయంగా లబ్థి చేకూరుతుందన్న ఆలోచన అన్ని పార్టీల్లోనూ ఉందని చెప్పాలి. దీంతో.. మూడు పార్టీలు వెనక్కి తగ్గుతున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకునే కన్నా.. లోగుట్టుగా అవగాహన కుదుర్చుకొని.. ఒక పార్టీ గెలుపు కోసం మరో పార్టీ గైర్హాజరు అయ్యే ఫార్ములాను ఫాలో అయ్యే వీలుందంటున్నారు. తమ ప్రత్యర్థి పార్టీల్లోని వారిని కొనేయటం ద్వారా మున్సిపాలిటీలను సొంతం చేసుకోవాలన్న ఆలోచనలోనూ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో మాత్రం అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ కే అడ్వాంటేజ్ ఉంటుందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హంగ్ నెలకొన్న మున్సిపాలిటీల్లో మరేం జరుగుతుందో సోమవారం నాటికి క్లారిటీ వచ్చేస్తుందని చెప్పాలి.