జనవరిలో టైం అయిపోతే.. ఏం చేస్తున్నారు: రేవంత్ సర్కారుకు సెగ!
రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలోనే మునిసిపల్ పాలక మండళ్ల ఎన్నికల గడువు ముగిసింది. ఇక, అప్పటి నుంచి ప్రత్యేక అధికారులతో వీటిని నెట్టుకువస్తున్నారు.;
తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ``జనవరిలోనే టైం అయిపోతే.. ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? ఎన్నికలు నిర్వహించాలని మీకు లేదా?`` అని కోర్టు నిలదీసింది. ఇటీవలే గ్రామ స్థాయి ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసిన విషయం తెలిసిందే. వచ్చే 90 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాలని.. దీనికి మీరు ఏం చేస్తారో తెలియదని కూడా వ్యాఖ్యానించింది. ఈ పరంపరలో ఇప్పుడు.. మునిసిపల్ ఎన్నికలపైనా హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలోనే మునిసిపల్ పాలక మండళ్ల ఎన్నికల గడువు ముగిసింది. ఇక, అప్పటి నుంచి ప్రత్యేక అధికారులతో వీటిని నెట్టుకువస్తున్నారు. ఈ క్రమంలో ఆయా మునిసిపల్ పాలక వర్గాలకుఎన్నికలు జరపక పోవడాన్ని ప్రశ్నిస్తూ.. ఎన్నికలు జరిపేలా ఆదేశించాలని కోరుతూ.. పదుల సంఖ్యలో కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని కొన్నాళ్లుగా విచారిస్తున్న హైకోర్టు తాజాగా ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరి 26న ముగిసినప్పటికీ.. ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలా చేయడానికి ఉన్న కారణం ఏంటి? ప్రభుత్వానికి ఏరకమైన అధికారం ఉందో కూడా తమకు వివరించాలని పేర్కొంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి.. హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను జూలై 11కు వాయిదా వేసింది. కాగా.. ఈ ఏడాది జనవరిలోనే కాలం ముగిసినప్పటికీ.. రాజకీయ కారణాలతోనే ఎన్నికలను వాయిదా వేశారని.. బీఆర్ ఎస్ నాయకులు విమర్శించిన విషయం తెలిసిందే.
స్థానికంగా తమకు(కాంగ్రెస్) బలం లేకపోవడం.. ప్రజలు ఈ ప్రభుత్వంపై విసిగిపోవడంతో స్థానిక ఎన్నికల్లో తమకు చుక్కెదురు అవుతుందని భావించే కాంగ్రెస్ ప్రభుత్వం మునిసిపల్ ఎన్నికలను నిర్వహించడం లేదని బీఆర్ ఎస్ నాయకులు కొన్నాళ్లుగా విమరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా హైకోర్టు తీర్పుతో ఈ సెగ మరింత పెరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.