58 ఏళ్ల వయసులో.. సెంచరీ కొట్టి.. ఫిదా చేసిన తెలంగాణ డీజీపీ
క్రికెట్‌పై ఆసక్తి ఉన్నవాళ్లు బ్యాట్ పట్టడం సాధారణమే. కానీ 58 ఏళ్ల వయసులోనూ మైదానంలోకి దిగి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ చేయడం మాత్రం అసాధారణమే.
క్రికెట్‌పై ఆసక్తి ఉన్నవాళ్లు బ్యాట్ పట్టడం సాధారణమే. కానీ 58 ఏళ్ల వయసులోనూ మైదానంలోకి దిగి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ చేయడం మాత్రం అసాధారణమే. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తాజాగా తన బ్యాటింగ్ సత్తాతో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచారు. హెచ్‌సీఏ సీ-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆయన అద్భుతమైన శతకంతో చెలరేగారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ రాణించి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
82 బంతుల్లో 126 పరుగులు
సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన సీవీ ఆనంద్.. హైదరాబాద్ జట్టుపై విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దూకుడుగా ఆడిన ఆయన ప్రత్యర్థి బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించారు. కేవలం 82 బంతుల్లోనే 21 ఫోర్లు, 5 సిక్సర్లతో 126 పరుగులతో అజేయంగా నిలిచారు.
అంటే ఒక్క ఇన్నింగ్స్‌లోనే బౌండరీల రూపంలో 114 పరుగులు సాధించడం విశేషం. వయసుతో సంబంధం లేకుండా ఆయన చూపించిన బ్యాటింగ్ దూకుడు చూసి క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బౌలింగ్‌లోనూ అదుర్స్
బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ సీవీ ఆనంద్ తన ఆల్‌రౌండ్ ప్రతిభను చాటుకున్నారు. ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన ఆయన కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా వ్యవహరించి జట్టు విజయానికి తన వంతు సహకారం అందించారు.
ఆనంద్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా సికింద్రాబాద్ క్లబ్ 39 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 328 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆనంద్‌కు తోడుగా జంషీద్ 77 పరుగులు, సంజీవ్ రెడ్డి 40 పరుగులతో రాణించారు.
వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం
328 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 21.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం మ్యాచ్‌ను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో వీజేడీ పద్ధతి ప్రకారం సికింద్రాబాద్ క్లబ్‌ను విజేతగా ప్రకటించారు.
గతంలోనూ ప్రొఫెషనల్ క్రికెటర్‌గా..
సీవీ ఆనంద్‌కు క్రికెట్‌తో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన ప్రొఫెషనల్ క్రికెట్ ఆడారు. సికింద్రాబాద్ క్లబ్ తరఫున గతంలోనే ఐదు సెంచరీలు సాధించిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు అండర్-22 క్రికెట్‌లోనూ తన ప్రతిభను చాటుకున్నారు.
అయితే తర్వాత ఐఏఎస్ చదువుపై దృష్టి పెట్టడంతో ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరమయ్యారు. అనంతరం సివిల్ సర్వీసెస్‌లో కొనసాగుతూ ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత కూడా తనలోని క్రికెటర్‌ను సీవీ ఆనంద్ మర్చిపోలేదని ఈ తాజా ఇన్నింగ్స్ నిరూపించింది.
58 ఏళ్ల వయసులో సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ అధికారిగా కఠిన బాధ్యతలు నిర్వహిస్తూనే క్రీడలపై ఆసక్తిని కొనసాగిస్తున్న సీవీ ఆనంద్‌ను పలువురు అభినందిస్తున్నారు. ఆయన ఆటతీరు యువ క్రికెటర్లకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.