వైసీపీలో వ‌ర్గ‌పోరు.. సీనియ‌ర్ నేత‌ల పొలిటిక‌ల్ వార్‌... !

గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసిపి కేవలం 11 సీట్లతో సరిపెట్టుకుంది. పలు జిల్లాల్లో అసలు ఆ పార్టీకి ప్రాథినిత్యం లేకుండా పోయింది.

Update: 2026-08-31 12:30 GMT

గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసిపి కేవలం 11 సీట్లతో సరిపెట్టుకుంది. పలు జిల్లాల్లో అసలు ఆ పార్టీకి ప్రాథినిత్యం లేకుండా పోయింది. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోని జిల్లాలలో వైసీపీలో సీనియర్ నేతలు మధ్య రాజకీయం రాజుకుంది. అసలే పార్టీ కష్టాల్లో ఉంది.. అందరం కలిసి పని చేద్దాం అని పార్టీ అధినేత జగన్ చెబుతుంటే.. జిల్లాస్థాయిలో నేతల మాత్రం ఎవరికి వారే రాజకీయ ఆధిపత్యం కోసం పార్టీని ముంచేస్తున్నారు. ఉత్తరాంధ్ర‌లోని శ్రీకాకుళం జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. తాజాగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద‌రావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా వైసీపీ వర్గాల్లో తీవ్రద‌మారం రేపుతున్నాయి.

మరి ముఖ్యంగా సొంత పార్టీ నాయకులను ఉద్దేశించి రామ్ మనోహర్ చాలా ఘాటుగా మాట్లాడారు. మా జిల్లాపై పక్క జిల్లాల వాళ్ళ పెత్తనం ఏంటని ? మాకు ఎవరి పెత్తనం అక్కర్లేదని.. ఎవరి తల వాళ్ళు దువ్వుకుంటే పాపిట తిన్నగా ఉంటుంది.. అదే పక్క‌నోడు దువ్వితే వంకరగా ఉంటుందని సెటైర్ వేయటం సంచలనంగా మారింది. తన తండ్రి ధర్మాన ప్రసాదరావు 2004లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించారని.. నాడు పక్క జిల్లాల వాళ్ళు గెలిపించలేదని రామమ‌నోహ‌ర్ చెప్పారు. ఆయన చేసిన కామెంట్లు చూస్తుంటే శ్రీకాకుళం పక్కనే ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ ఉద్దేశించే అన్నారని పార్టీలో చర్చ జరుగుతుంది.

పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయినా బొత్స పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. పైగా విశాఖ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ కుటుంబానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మంచి గ్రిప్ ఉంది. మరీ ముఖ్యంగా ఎచ్చెర్ల - రాజాం నియోజకవర్గాలు విజయనగరం లోక్‌స‌భ సీటు పరిధిలోకి వెళ్లాయి. పాలకొండ మన్యం జిల్లాలో భాగంగా ఉంది. దీంతో ఈ మూడు నియోజకవర్గాలు పూర్తిగా బొత్స కనుస‌న్న‌ల్లోకి వెళ్లిపోయాయి అని వైసిపి వాళ్ళే భావిస్తున్నారు. జిల్లాలోని తూర్పు కాపులు, కాళింగుల‌తో పాటు ఇతర సామాజిక వర్గాల వాళ్ళు కూడా బొత్స‌తోపాటు ఆయన మేనల్లుడు చిన్న శ్రీను వద్దకు పరుగులు పెడుతూ ఉంటారు.

రామ్‌మ‌నోహ‌ర్ కామెంట్లు త‌న తండ్రి మ‌న‌సులో ఉన్న మాట‌లే అని.. ఆయ‌న‌కు తెలియ‌కుండా అంత డేర్‌గా మాట్లాడ‌ర‌ని వైసీపీ వాళ్లే గుసగుస‌లాడుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ధ‌ర్మాన‌కు జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప‌లుకుబ‌డి త‌గ్గింది. అస‌లు ధ‌ర్మాన‌ను శ్రీకాకుళం ఇన్‌చార్జ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని కూడా జ‌గ‌న్ ఆలోచిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటు బొత్స ఎమ్మెల్సీగా గెల‌వ‌డం.. మండ‌లిలో పార్టీ ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉండ‌డంతో బొత్స ఇమేజ్ పెరుగుతోంది. బొత్స త‌మ జిల్లాలో జోక్యం చేసుకోవ‌డం న‌చ్చ‌కే రామ్‌మ‌నోహ‌ర్ ఈ కామెంట్లు చేశార‌ని వైసీపీ ఇన్న‌ర్ టాక్ ?

Tags:    

Similar News