బీజేపీవైపు ‘కొండా‘ అడుగులు ?!
మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలయిన వివాదం ఎటువైపు దారితీస్తుంది అన్న విషయం ఇంకా తేలలేదు.
‘కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరతానని చెబితే దానిపై నేను స్పందిస్తాను. ఆమెను పార్టీలోకి తీసుకోవాలా ? వద్దా ? అన్నది నా వ్యక్తిగత నిర్ణయం కాదు. పార్టీ నాయకత్వం సమిష్టిగా తీసుకునే నిర్ణయం’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘కొండా సురేఖ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీలో చేరతానంటే మేమెవరమూ వ్యతిరేకించం’ అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొండు సురేఖ బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందా ? లేదా ? అన్న చర్చలు ఊపందుకున్నాయి.
మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలయిన వివాదం ఎటువైపు దారితీస్తుంది అన్న విషయం ఇంకా తేలలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో సెప్టెంబరు 1న ఆయన వచ్చాక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ప్రస్తుతం బంతి అధిష్టానం కోర్టులో ఉంది.
తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, గాంధీ కుటుంబం మీద తమకు పూర్తి విశ్వాసం ఉందని కొండా సురేఖ భర్త కొండా మురళి చెబుతుండగా, తన టార్గెట్ రేవంత్ రెడ్డి అని, కాంగ్రెస్ పార్టీ కాదు అని కొండా సుష్మిత అంటున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే రాఖీ పౌర్ణమి సంధర్భంగా రేవంత్ రెడ్డిని కలిసిన కొండా సురేఖ ఆయనకు బంగారు రాఖీని కట్టింది. అతని మనవడికి కూడా రాఖీ కట్టడం గమనార్హం.
కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితంగా కొండా సురేఖను రాజీనామా చేయాలని కోరుతుందని ప్రచారం జరుగుతున్నది. క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ పేరుతో ఆమెతో రాజీనామా చేయిస్తారని అంటున్నారు. తన మీద చర్యలు తీసుకోకుంటే పార్టీలో మరికొందరు కూడా ఇలాగే వ్యవహరించే అవకాశం ఉందని, అందుకే సెప్టెంబరులో శాసనసభ సమావేశాలకు ముందే మంత్రి వర్గ విస్తరణ లేదా కొండా సురేఖ రాజీనామా అంశంలో అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి వత్తిడి పెంచుతున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ కొండా సురేఖ రాజీనామా చేస్తే బీజేపీ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు ఆమె కూతురు సుష్మిత జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది.
అయితే కొండా కుటుంబం బీజేపీలోకి వెళ్తే పరకాల, వరంగల్ తూర్పులో ప్రభావం చూపుతారని అంటున్నారు. కాగా గత ఎన్నికల్లో వరంగల్ తూర్పులో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు మీద కొండా సురేఖ 15,652 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఇక్కడ కొండా సురేఖకు 67,757 ఓట్లు రాగా, ప్రదీప్ రావు 52,105 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలబడ్డాడు. దీంతో ఆమె బీజేపీలోకి వస్తే ప్రదీప్ రావు పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా మొదలయింది.
ఇక పరకాలలో గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాళీ ప్రసాద్ రావు 38,735 ఓట్లు సాధించారు. పోలైన ఓట్లలో సుమారు 20.5 శాతం ఓట్లు దక్కించుకున్నారు. అయితే కొండా సురేఖ వస్తే అక్కడ బీజేపీ మరింత పుంజుకుంటుంది అన్న చర్చ ఒకవైపు ఉండగా, ఆమె పార్టీలోకి వచ్చి పరకాల, వరంగల్ తూర్పు స్థానాలలో తాను, తన కూతురు పోటీ చేస్తే తమ పరిస్థితి ఏంటి అని ఇప్పటి వరకు అక్కడ ఉన్న నాయకులు ఆలోచనలో పడ్డారు. మరి కొండా సురేఖ ఎంట్రీ ఖాయమేనా అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.