శుభకార్యం ఇంట్లో ‘హిజ్రా’ల శాపనార్థాల భయం.. బాధితుల కన్నీళ్లు.. పోలీసుల నిశ్శబ్దం మారేదేప్పుడు?
ఇటీవల హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఒక ఘటన ప్రస్తుతం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది.
జీవితంలో అత్యంత పవిత్రమైన ఘట్టం.. పెళ్లి. ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో.. కళ్ల నిండా వేల ఆశలతో.. ఆత్మీయుల సమక్షంలో ఒక కుటుంబం పండగ చేసుకునే వేళ అది. కానీ అదే శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఒకేసారి పదుల సంఖ్యలో వచ్చి పడే హిజ్రాలు చేసే హంగామా.. వారి నోటి నుంచి వచ్చే బూతులు, శాపనార్థాలు ఆ పెళ్లి పందిట్లోని ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఒక ఘటన ప్రస్తుతం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది.
పక్కింట్లో పెళ్లి జరుగుతుండగా ఒకేసారి పదిమంది హిజ్రాలు రావడం, నేరుగా రూ. 50 వేలు కావాలని డిమాండ్ చేయడం.. ఇవ్వలేమని.. రూ. 20 వేలు ఇస్తామని కుటుంబ సభ్యులు వేడుకున్నా వినకపోవడం నిజంగా దారుణం. అంతటితో ఆగక, మొండిగా ఇంటి గుమ్మం ముందే బైఠాయించి.. ఫోన్లు చేసి మరో పదిమందిని పిలిపించి నడిరోడ్డుపై బూతులు తిడుతుంటే ఆ కుటుంబం పడిన మానసిక వేదన వర్ణనాతీతం. చుట్టాలు, బంధువుల ముందు మర్యాద పోతుందనే భయంతో వారి శాపనార్థాలకు వెరచి, ఆఖరికి రూ. 35 వేలు చెల్లించి పంపించేవరకు ఆ కుటుంబం అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేనిది.
కష్టపడి పెళ్లి జరిపిస్తున్న తండ్రికి, కళ్లముందే కన్నీళ్లు పెట్టుకుంటున్న కడపటి బిడ్డకు ఈ ఆవేదన ఎవరు తీరుస్తారు? సంప్రదాయం పేరిట, దీవెనల పేరిట జరుగుతున్న ఈ బలవంతపు వసూళ్లు, బెదిరింపులు సామాన్యుల పాలిట శాపంగా మారాయి. రూ. 50,000 డిమాండ్ చేయడం ఏ రకమైన ఆశీర్వచనం? ఇది ఆశీర్వాదం కాదు.. అడ్డగోలు దోపిడీ అని బాధితులు రోదిస్తున్నారు.
అందరూ ఒకేలా ఉండరని, హిజ్రా సమాజాన్ని మొత్తంగా తప్పుబట్టలేమని అంగీకరించినా.. శుభకార్యం ఇంట్లో చొరబడి దౌర్జన్యానికి దిగుతున్న సంస్కృతికి అడ్డుకట్ట పడాల్సిందే. చట్టం, పోలీసులు ఉన్నా కూడా తమ సంతోషాన్ని కాపాడుకోవడానికి సామాన్యులు వేలల్లో లంచంలా డబ్బులు అప్పగించాల్సి రావడం మన వ్యవస్థలోని వైఫల్యానికి నిదర్శనం.
పోలీస్ వ్యవస్థ, అధికారులు ఇప్పటికైనా నిద్ర మేల్కోవాలి. 'డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోం' అని బెదిరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. శుభకార్యాల సమయంలో కుటుంబాలకు రక్షణ కల్పిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలి. ఒక కుటుంబం ఆనందంగా జరుపుకునే పండగ వాతావరణం, భయాందోళనల నడుమ కన్నీళ్లతో ముగియకూడదు. ఈ రచ్చకు అడ్డుకట్ట పడే రోజు ఎప్పుడో అధికారులు సమాధానం చెప్పాలి.