పూల సుబ్బయ్య ఎవరంటే..? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం వెనుక బిగ్ స్టోరీ
ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాలకు సాగు, తాగునీటిని అందిస్తుంది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.
పశ్చిమ ప్రకాశంతోపాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి వెలిగొండ ప్రాజెక్టు నిర్మించారు. అయితే ఈ ప్రాజెక్టును పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా పరిగణిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలలో పెద్దగా తెలియని పూల సుబ్బయ్య పేరును ప్రాజెక్టుకు ఎందుకు పెట్టారు? అన్న సందేహం ప్రతి ఒక్కరిని పీడిస్తుంది. అయితే రాష్ట్రంలో చాలా మందికి తెలియని పూల సుబ్బయ్య కోసం మార్కాపురం జిల్లా ప్రజలు మాత్రం చాలా గొప్పగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సోమవారం ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతుండగా, పూల సుబ్బయ్య పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి సందేహాలు నివృత్తి చేస్తోంది ఈ స్టోరీ.
ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాలకు సాగు, తాగునీటిని అందిస్తుంది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో పూర్తి గ్రావిటీతో ఆ జలాలను పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి తరలించి ఈ ప్రాంతాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు పూల సుబ్బయ్య. 1929 జూన్ 29న ప్రకాశం జిల్లా కంభంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిన కోల్పోయారు. తల్లి సుబ్బమ్మ కష్టంతోనే పెరిగార. 1946లో గుంటూరులో డిగ్రీ పూర్తి చేసిన పూల సుబ్బయ్య 1950లో ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత 1952-53లో న్యాయశాస్త్రం చదివి మార్కాపురంలో లాయర్ గా స్థిరపడ్డారు.
1946లో డిగ్రీ పూర్తయిన తర్వాత విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న పూల సుబ్బయ్య 1962లో తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేశారు. యర్రగొండ పాలెం నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టు పార్టీ తరపున శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1967లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇక 1978లో మార్కాపురం నియోజకవర్గానికి మారారు. అక్కడ కూడా ఘన విజయం సాధించడంతో మార్కాపురం వాసులతో బలమైన బంధం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ ప్రాంత శాసనసభ్యుడిగా ఉన్న పూల సుబ్బయ్యకు అక్కడి ప్రజలు తాగు, సాగునీటి సమస్యలు నిద్ర పట్టనీయలేదని చెబుతున్నారు. దీంతో పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి కృష్ణా జలాలు తరలించాలని పెద్ద ఎత్తున ఉద్యమించారని చెబుతున్నారు.
శాసనసభ్యుడిగా పూల సుబ్బయ్య చేసిన ఉద్యమంతో ప్రభుత్వం దిగివచ్చిందని అంటున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెలిగొండ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెబుతున్నారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 1996 మార్చి నెలలో తొలిసారి వెలిగొండకు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు హయాంలో పర్యావరణ అనుమతులు తీసుకురాగా, ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రెండోసారి శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. ఈ సమయంలోనే స్థానికుల డిమాండ్ మేరకు వెలిగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరణం చేశారు.
అలా వైఎస్ హయాంలో పూల సుబ్బయ్య వెలిగొండగా రూపాంతరం చెందిన ఈ ప్రాజెక్టు దాదాపు మూడు దశాబ్దాల పాటు అనేక అవాంతరాలు ఎదుర్కొని ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. 53.85 టీఎంసీల పూర్తి సామర్థం ఉన్న ఈ ప్రాజెక్టు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మంది ప్రజలకు తాగునీరు సరఫరా అందించనుంది. ప్రస్తుతం తొలివిడతగా విడుదల చేస్తున్న పది టీఎంసీల నీటితో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.