మోదీ ‘మన్ కీ బాత్’ : కడప రైతు విజయగాథపై ప్రధాని ప్రశంసలు.. లక్షల్లో సంపాదన!
సంప్రదాయ సాగుకు స్వస్తి చెప్పి, విదేశీ పంటలు సాగు చేసిన ఓ రైతు ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు. దేశంలోని మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలిచిన ఆ రైతు విజయం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.
సంప్రదాయ సాగుకు స్వస్తి చెప్పి, విదేశీ పంటలు సాగు చేసిన ఓ రైతు ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు. దేశంలోని మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలిచిన ఆ రైతు విజయం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అందరి రైతులు మాదిరిగానే శ్రమించిన రైతు ఒకే ఒక్క వినూత్న ఆలోచనతో రికార్డు స్థాయి ఆదాయం సంపాదిస్తున్నారు. యూట్యూబ్ లో తెలుసుకుని తన పొలంలో ప్రయోగం చేయడం ద్వారా మిగిలిన రైతులకు స్ఫూర్తిగా నిలిచిన ఆ రైతు పేరు వరదరాజ్. ఏపీలోని కడపకు చెందిన ఆయన ప్రతిభ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించింది. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రసిద్ధ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 137వ ఎపిసోడ్‌లో వరదరాజ్ ప్రతిభను ప్రత్యేకంగా కొనియాడారు. దేశవ్యాప్తంగా ఉన్న వినూత్న వ్యవసాయ విజయాలను మన్ కీ బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని మోదీ కడప జిల్లా రైతు వరదరాజ్ అవలంబించిన సాగు విధానం, ఆయన సాధించిన సక్సెస్‌ను జాతికి ఆదర్శం అంటూ కొనియాడారు.
యూట్యూబ్ స్పూర్తితో విదేశీ పండ్ల సాగు
కడప జిల్లాకు చెందిన రైతు వరదరాజ్ తన పొలంలో ఏళ్లుగా టమోటాలు, అరటిపండ్లను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సాధారణంగా వచ్చే ఆదాయంతోనే సర్దుకుపోతున్న ఆయన ఆలోచనలో ఒకరోజు సరికొత్త మార్పు వచ్చింది. తన స్నేహితుడి పొలంలో 'అవకాడో' పంటను చూసిన ఆయనలో ఆసక్తి మొదలైంది. ఒకప్పుడు మన దేశంలో ఈ పండు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దీని విలువ, మార్కెట్‌లో డిమాండ్ కూడా నామమాత్రమే. కానీ, నగరాల్లోని రెస్టారెంట్లు, హై-ఎండ్ హోటళ్లలో 'అవకాడో టోస్ట్' రూపంలో దీనికి విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న విషయాన్ని వరదరాజ్ గమనించారు.
ఆలస్యం చేయకుండా ఇంటర్నెట్ బాట పట్టారు. ప్రముఖ వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ వేదికగా అవకాడో సాగు మెలకువలు, నేల స్వభావం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ వంటి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. పట్టుదలతో తనకున్న కొంత భూమిలోనే అవకాడో మొక్కలను నాకి సాగు చేపట్టారు. వరదరాజ్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. యూట్యూబ్ ద్వారా నేర్చుకున్న ఆధునిక పద్ధతులను సరిగ్గా అమలు చేయడంతో ఆయన తోటలో అవకాడో చెట్లు ఏపుగా పెరిగి కాపు కాశాయి. ఇప్పటివరకు ఆయన తన పొలంలో దాదాపు నాలుగు టన్నుల అవకాడో పండ్లను విజయవంతంగా పండించారు. పండించిన పంటను స్థానిక మార్కెట్లకు సరఫరా చేస్తూ మంచి గిట్టుబాటు ధరను అందుకుంటున్నారు. టమోటా, అరటి సాగుతో పాటు ఈ విదేశీ పండు ద్వారా ఆయన ఆర్జిస్తున్న అదనపు ఆదాయం ఇప్పుడు తోటి రైతులకు సైతం కనువిప్పు కలిగిస్తోంది.
ప్రధాని ప్రశంసలు
మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ఈ రోజుల్లో అవకాడో గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకప్పుడు దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ నేడు ఇది పట్టణాల్లోని డైనింగ్ టేబుల్స్‌పై తరచుగా కనిపిస్తోంది. నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి మనం తరచుగా వింటున్నాము. మన దేశంలోని వినూత్న ఆలోచనలు కలిగిన రైతులు ఈ విదేశీ పండును సాగు చేస్తూ, అదనపు ఆదాయం సంపాదించుకునేందుకు ఒక చక్కటి కొత్త మార్గాన్ని కనుగొన్నారు" అని కడప రైతు వరదరాజ్ ఆలోచనలను ప్రశంసించారు. ఏపీకి చెందిన వరదరాజ్‌తోపాటు తమిళనాడుకు చెందిన మరో రైతు చంద్రశేఖరన్ వైవిధ్యంగా ఆలోచించి, లాభసాటి వ్యాపారంగా మార్చుకున్న వైనాన్ని మోదీ కొనియాడారు.
రైతులకు నూతన దిశానిర్దేశం
నేడు వ్యవసాయ రంగంలో కేవలం వాతావరణం మీద ఆధారపడటమే కాకుండా, మార్కెట్ ట్రెండ్స్‌ను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కడప రైతు వరదరాజ్ కేవలం ఒక ఇంటర్నెట్ వీడియోను ఆయుధంగా మలుచుకుని, విదేశీ పండ్లను మన నేలలో పండించి ఆదర్శంగా నిలిచారు. ఈ సక్సెస్ స్టోరీ కేవలం ఆంధ్రప్రదేశ్ రైతులకు మాత్రమే కాక, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు సరికొత్త మార్గాలను అన్వేషించేలా స్ఫూర్తిని ఇస్తోందని అభినందిస్తున్నారు.