విజయ్ ప్రధాని...రాహుల్ శిబిరం అసహనం

టీవీకే ఒక రాజకీయ పార్టీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు ఏకంగా ముఖ్యమంత్రి పీఠం పట్టేసింది.

Update: 2026-08-30 11:30 GMT

విజయ్ ప్రధాని అన్న ప్రచారాన్ని టీవీకే నేతలు అతి ఉత్సాహంతో చేస్తున్నారు. పార్టీ నేతలు అయితే ఏమో అనుకోవచ్చు ఏకంగా మంత్రులు కూడా విజయ్ సార్ ప్రధాని అయ్యే అర్హతలు కలిగి ఉన్నారంటూ పొగుడుతున్నారు. దాంతో పాటు ఫ్లెక్సీలు కూడా కట్టి మరీ టీవీకే నేతలు చేస్తున్న హంగామా తమిళనాడు సరిహద్దులు దాటి ఢిల్లీ దాకా వ్యాపించింది. దాంతో కాంగ్రెస్ దీని మీద సీరియస్ గా ఉంటే రాహుల్ శిబిరం పూర్తి అసహనం వ్యక్తం చేస్తోంది అని అంటున్నారు. ఇంతకీ నాలుగు నెలల ముఖ్యమంత్రి అయిన టీవీకే అధినేత తమిళనాడు సీఎం విజయ్ అపుడే ప్రధాని అయిపోవడమేంటి అన్న చర్చ వస్తోంది. ఎందుకిలాంటి ప్రచారం వచ్చింది అంటే విజయ్ పేరుని కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఇండియా టుడే – సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే చేశాయి. అందులో రాహుల్ గాంధీకి 27 శాతం ఓట్లు వస్తే విజయ్ కి తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి. అఫ్ కోర్స్ ప్రధాని మోడీ ఎవరికీ అందనంత ఎత్తులో 49 శాతంతో ముందు వరసలో ఉన్నారనుకోండి.

టీవీకేలో ఉత్సాహాం :

టీవీకే ఒక రాజకీయ పార్టీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు ఏకంగా ముఖ్యమంత్రి పీఠం పట్టేసింది. దక్షిణాదిన అతి పెద్ద స్టేట్ అయిన తమిళనాడుకు విజయ్ సీఎం అయిపోయారు. అంతే కాదు రెండు ప్రధాన పార్టీలు అయిన ద్రవిడ శిబిరాలను కకావికలం చేసి వారి రాజకీయాలు అయోమయంలో పడేశారు. ఇక విజయ్ సీఎం అయిన తరువాత తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. విజయ్ సాధించిన ఈ అనూహ్యమైన సక్సెస్ అయితే జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చగా సాగుతూ వస్తోంది. ఆయనకు జెన్ జీ మద్దతు ఉందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఇపుడు చూస్తే విద్యార్ధి ఉద్యమాలతో జెన్ జీ చురుకుగా ఉంది. ఈ నేపథ్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ కింద ప్రధాని రేసులో ఉన్న వారి జాబితాలోకి విజయ్ పేరుని కూడా తీసుకుంటే ఆయనకు ఆశ్చర్యకరంగా తొమ్మిది శాతం మద్దతు లభించింది.

టాప్ త్రీలో విజయ్ :

అంతే కాదు టాప్ త్రీలో విజయ్ పేరు ఉండటంతో మోడీ వర్సెస్ రాహుల్ తో పాటు విజయ్ కూడా రేసులోకి దూసుకుని వచ్చారు అని అంటున్నారు. ఇండియా టుడే – సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాల ప్రకారం చూస్తే ప్రధాని రేసులో తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ మూడో స్థానంలో నిలిచి సంచలనం సృష్టించారు. ఆయనకు సర్వేలో 9.2 శాతం మద్దతు లభించింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ: 49 శాతం మద్దతుతో మొదటి స్థానంలో ఉంటే రాహుల్ గాంధీ 27 శాతం మద్దతుతో రెండో స్థానంలో నిలిచారు. దాంతో దేశంలో విపక్ష కూటమిని నడిపించే నేతగా ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి అత్యంత అనుకూలమైన నాయకుడు ఎవరనే ప్రశ్నకు కూడా జవాబుగా విజయ్ ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధించారు అంటున్నారు. ఇక ఈ రేసులో వెనుకబడిన జాతీయ నాయకులుగా మమతా బెనర్జీ 2 శాతం అఖిలేష్ యాదవ్ 1.7 శాతం, అరవింద్ కేజ్రీవాల్ 1.2 శాతం సాధించారు. ఇండియా టుడే సీఓటర్ సర్వే ఫలితాలు వెల్లడి కావడంతో జయ్ క్రేజ్ కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ముఖ్యంగా యువ ఓటర్లలో విస్తరిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాహుల్ తోనే సాధ్యం :

అయితే ఈ సర్వే ఫలితాలు టీవీకేలో కొత్త ఉత్సాహం నింపాయి, కాబోయే ప్రధాని అంటూ టీవీకే మంత్రులు కూడా అంటున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ విజయ్ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ అయితే తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. ఇది మంచి విధానం కాదని తమిళ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మోడీని ఢీ కొట్టే సత్తా రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని అంటున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్కం ఠాగూర్ లాంటి వారు అయితే మంత్రులు కూడా అభిమానులుగా మారిపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు అని అంటున్నారు. మొత్తానికి విజయ్ కి జాతీయ స్థాయిలో మద్దతు దక్కడం కాదు కానీ తమిళనాడు ప్రభుత్వంలో చిచ్చు రాజేసేలా టీవీకే నేతల అతి ఉత్సాహం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News