మేయర్ సీటుపై కమ్మ నేతల కన్ను ?

విశాఖ మేయర్ అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనది అన్నది తెలిసిందే. ఏడాదికి అయిదు వేల కోట్ల బడ్జెట్ తో కార్పోరేషన్ నిర్వహణ సాగుతోంది.

Update: 2026-08-30 10:30 GMT

విశాఖ మేయర్ అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనది అన్నది తెలిసిందే. ఏడాదికి అయిదు వేల కోట్ల బడ్జెట్ తో కార్పోరేషన్ నిర్వహణ సాగుతోంది. రానున్న అయిదేళ్లలో ఇది కాస్తా పది వేల కోట్లకు చేరుకుంటుంది అన్నది కూడా ఉంది. అలాగే శివారు ప్రాంతాలలోని గ్రామ పంచాయతీలు మండలాలను విలీనం చేసుకోవడం ద్వారా బృహత్ విశాఖ కార్పోరేషన్ గా అవతరించనుంది. ఇక జీవీఎంసీ పరిధిలోనే దేశంలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం అవుతోంది. ఐటీ కంపెనీలు వస్తున్నాయి. అలాగే మిట్టల్ స్టీల్ ప్లాంట్ తో పాటు అనేక పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. దాంతో జీవీఎంసీ ఆర్థికంగా అన్ని విధాలుగా ముందుకు దూసుకుని పోయే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. కూటమి ప్రభుత్వానికి విశాఖ మీద ఫోకస్ ఉంది. ప్రత్యేకించి టీడీపీ విశాఖను ఆర్థిక పారిశ్రామిక రాజ్ధానిగా భావిస్తోంది. ఆ విధంగానే అభివృద్ధి చేస్తోంది.

టీడీపీ టార్గెట్ :

విశాఖ మేయర్ సీటుని 1987లో టీడీపీ దక్కించుకుంది. ఆనాడు డీవీ సుబ్బారావు ఎన్నిక అయ్యారు. అది ప్రత్యక్ష ఎన్నికలలోనే జరిగింది. అయిదేళ్ల పాటు ఆనాటి పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజుకీ చెప్పుకుంటారు. ఇక ఆనాటి నుంచి మళ్ళీ మేయర్ సీటు టీడీపీకి దక్కలేదు. 2025 లో వైసీపీ మేయర్ మీద అవిశ్వాసం ప్రవేశపెట్టి ఒక ఏడాది మాత్రం టీడీపీ పాలన చేసింది. ఈసారి అలా కాదు పూర్తి కాలం తాము అధికారంలో ఉంటే విశాఖకు ఒక రూపు షేపూ తీసుకుని రావచ్చు అని పసుపు పార్టీ ఆలోచిస్తోంది. దాంతో విశాఖ మేయర్ సీటు టీడీపీకే దక్కుతుందన్నది అందరికీ తెలిసిపోయింది. దాంతో టీడీపీలోనే పెద్ద ఎత్తున పోటీ ఏర్పడుతోంది.

కమ్మ నేతల చూపు :

విశాఖ మేయర్ గా ఇప్పటిదాకా చూస్తే రెడ్డి, బ్రాహ్మణ, వెలమ, యాదవ, మత్స్యకార,, గవర సామాజిక వర్గాలకు చెందిన వారు పనిచేశారు. ఈసారి ఇతర సామాజిక వర్గాలకు కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది. మేయర్ గా కాపులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎందుకంటే ఎక్కువ జనాభాగా వారు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో కమ్మ సామాజిక వర్గం నేతల నుంచి ఈసారి అనూహ్యంగా రేసులో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. దాంతో విశాఖ మేయర్ సీటు ఎవరికి దక్కుతుందన్నది టీడీపీలో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది.

వీరంతా పోటీకి :

కమ్మ సామాజిక వర్గం నుంచి విశాఖ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న చోడె వెంకట పట్టాభిరాం పోటీలో ఉంటారని ప్రచారం ఊపందుకుంది. ఆయన కొద్ది నెలల క్రితం కీలకమైన పార్టీ పదవిని అందుకున్నారు. దాంతో పాటు రుషికొండ వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ గా నామినేటెడ్ పదవిని అందుకున్నారు. ఆయన గతంలో జీవీఎంసీలో కార్పోరేటర్ గా పనిచేయడమే కాదు టీడీపీ తరఫున ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. దాంతో ఆయనకు జీవీఎంసీ పాలనా వ్యవహారాల మీద పూర్తి అవగాహన ఉందని అంటున్నారు. దాంతో ఆయన పేరుని రేసులో ముందుకు తెస్తున్నారు. ఆయన కూడా సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఆయన అభ్యర్ధిత్వం పట్ల టీడీపీ పెద్దలు సానుకూలంగా ఉంటారని కూడా మాట వినిపిస్తోంది.

ఆయన చూపు మేయర్ సీటు మీద :

అలాగే విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కూడా తన కుమారుడుని మేయర్ సీటు కోసం ముందు వరసలోకి తెస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే యువ నేతగా ఉన్న ఆయన విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగుతారు అని ప్రచారం ఉంది. కానీ ఇపుడు ఆయన చూపు మేయర్ సీటు మీద పడింది అని అంటున్నారు. సీనియర్ నేతగా ఉన్న వెలగపూడికి మంత్రి పదవి అయితే దక్కాల్సి ఉంది. కానీ సామాజిక సమీకరణలో ఇవ్వలేకపోయారు. దాంతో ఆయన కుమారుడికి మేయర్ సీటు ఇస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. వీరిద్దరితో పాటు మరికొందరు కమ్మ నేతల చూపు కూడా విశాఖ మేయర్ సీటు మీద ఉంది. అయితే విజయవాడ మేయర్ సీటును బట్టి ఇక్కడ అభ్యర్ధి నిర్ణయం టీడీపీ చేస్తుంది అని అంటున్నారు. విజయవాడ మేయర్ సీటు కాపులకు ఇస్తే విశాఖ కమ్మలకు ఇస్తారని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ఏ మేరకు నిజం అవుతుంది అన్నది.

Tags:    

Similar News