అటు కూట‌మి బ‌లం.. ఇటు జ‌గ‌న్ వార్నింగ్‌... వాళ్ల‌కు టెన్ష‌న్‌...?

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులలో తీవ్ర ఆందోళనను నింపుతున్నాయి.

Update: 2026-08-30 08:17 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులలో తీవ్ర ఆందోళనను నింపుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని 16 కార్పొరేషన్ల మేయర్ పదవులతో పాటు, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల ఎంపిక వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జులకు పెద్ద తలనొప్పిగా మారింది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని స్థానిక ఎన్నికల్లో ఢీకొట్టడం అంత తేలికైన విషయం కాదు. అధికార పక్షానికి ఉండే ఆర్థిక బలం, అధికారుల సహకారం, మరియు స్థానిక అభివృద్ధి కోసం అధికార పార్టీకే ఓటేయాలన్న ఆలోచ‌న ఉంటే ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను డైవ‌ర్ట్ చేయ‌డం ఇవ‌న్నీ ఇప్పుడు వైసీపీ నాయ‌కుల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇక ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండున్న‌రేళ్లు అవుతోంది. కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నా స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థిని గెలిపిస్తే తమ పట్టణాలు అభివృద్ధికి దూరమవుతాయని ఓటర్లలో సందేహం ఉంటుంది. అందుకే స్థానిక ఎన్నిక‌ల్లో మెజార్టీ స్థానాల్లో విజ‌యం అధికార పార్టీల‌కే ఉంటుంది. అస‌లు చాలా చోట్ల ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన వారు పోటీ చేసేందుకే ముందుకు రారు. ఇప్పుడు ఏపీలో కూట‌మి అంటూ మూడు బ‌ల‌మైన పార్టీలు క‌లిసి ఉన్నాయి. ఈ కూట‌మి నేత‌ల సామ, దాన, భేద, దండోపాయాలను తట్టుకుని నిలబడగలిగే బలమైన నేతలు వైసీపీకి దొరకడం కష్టంగా మారింది.

డైరెక్ట్ ఎలక్షన్ టెన్షన్ :

ఈసారి మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపిక ప్రత్యక్ష పద్ధతిలో (డైరెక్ట్ ఎలక్షన్) జరగనుండటంతో చివరి నిమిషం వరకు అధికార పార్టీ నుంచి ప్రలోభాలు, ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉంది. వీలైనన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తుండగా, పోటీ లేకుండా ఏకగ్రీవమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని అధినేత జగన్ చేసిన హెచ్చరికలు ఇన్ఛార్జులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జ‌గ‌న్ ఏక‌గ్రీవం అయిన నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇవ్వ‌ను అంటూ ఖ‌రాఖండీగా చెప్పడంతో వైసీపీ ఇన్చార్జ్‌లు పోటీ పెట్టేందుకు అభ్య‌ర్థుల‌ను వెతుక్కోవ‌డం, వారికి ఆర్థిక వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చుకోవ‌డం, గెలిపించుకోవ‌డం లాంటి విష‌యాల్లో స‌త‌మ‌తం కానున్నారు.

కొన్ని చోట్ల అభ్య‌ర్థులు ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. జ‌గ‌న్ ఏక‌గ్రీవాల విష‌యంలో వార్నింగ్‌లు ఇవ్వ‌డంతో కూట‌మి చాలా ప్రెస్టేజ్‌గా తీసుకుని పులివెందుల లాంటి చోట్లే ఏక‌గ్రీవాలు చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇక మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. ఇక పార్టీ కేడ‌ర్ అయితే ప్రతిపక్షంలో ఉంటూ సొంత డబ్బులు ఖర్చు పెట్టేందుకు నేతలు వెనుకాడుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అభ్యర్థుల ఎంపిక పూర్తయి, ఎన్నికలు ముగిసే వరకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జులకు టెన్షన్ తప్పేలా లేదు.

Tags:    

Similar News